డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదనడానికి ఫొటోలే సాక్ష్యమా?

Andhra Pradesh High Court questioned police on Driving license - Sakshi

పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు  

సాక్షి, అమరావతి: డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదంటూ ఓ ఫొటో తీసి, దాని ఆధారంగా చలాన్‌ చెల్లించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదనడానికి ‘ఫొటో’ ఎలా సాక్ష్యం అవుతుందని పోలీసులను ప్రశ్నించింది. మోటారు వాహన చట్ట నిబంధలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నప్పుడు, ఫోన్‌ చేసి చలాన్‌ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్‌పీని ఆదేశించింది.

తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్‌ చూపలేదన్న కారణంతో పాటు హెల్మెట్‌ పెట్టుకోలేదని, సెల్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నానన్న కారణాలతో చల్లపల్లి పోలీసులు తనకు చలాన్‌ విధించడాన్ని సవాలు చేస్తూ కృష్ణాజిల్లా, మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదని ఆరోపిస్తున్న పోలీసులు.. అందుకు వారు తీసిన ఫొటోను సాక్ష్యంగా చూపుతున్నారని తెలిపారు. పోలీసులు చూపుతున్న ఫొటో లైసెన్స్‌ అడిగిన దానికి రుజువు కాదన్నారు. పోలీసులు చూపుతున్న ఫొటోలోని వ్యక్తి పిటిషనర్‌ కాదన్నారు. ఆ వాహనం కూడా పిటిషనర్‌ది కాదని, కేవలం వాహన నంబర్‌ మాత్రమే పిటిషనర్‌కు చెందిందన్నారు. పోలీసులు రోజూ ఫోన్‌ చేస్తూ చలాన్‌ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top