రాష్ట్రం రావణ కాష్టం కావాలా? | Andhra pradesh High Cour fires on Chandrababu government | Sakshi
Sakshi News home page

రాష్ట్రం రావణ కాష్టం కావాలా?

Jul 1 2026 5:49 AM | Updated on Jul 1 2026 5:49 AM

Andhra pradesh High Cour fires on Chandrababu government

చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు  

పోలీసులు ఏం చేసినా అడిగే వారు లేరనుకుంటున్నారా?.. చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు  

కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా? 

కొన్ని ప్రమాణాలుండాలంటూ ప్రభుత్వ న్యాయవాదిపైనా అసహనం.. ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించకూడదని హితవు 

మూడేళ్ల లోపు శిక్ష పడే కేసులను మూడేళ్లు దాటాక కోర్టులు విచారణకు స్వీకరించలేవు 

సీఆర్‌పీసీలో దీనిపై స్పష్టమైన నిషేధం ఉందని స్పష్టీకరణ 

2021లో నమోదైన కేసులో ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై తీవ్ర అభ్యంతరం 

వివరాలు సమర్పిస్తామని కోర్టులో చార్జిషిట్‌ దాఖలు చేస్తారా? 

ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే

ప్రాసిక్యూషన్‌ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నీ నిలిపివేత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అడ్మినిస్ట్రేషన్‌ ఏ మాత్రం సక్రమంగా లేదు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)ని ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. రూల్‌ ఆఫ్‌ లా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి, సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగే వారు లేరనుకుంటున్నారా? లేక మీరే తెలివైన వాళ్లు అనుకుంటున్నారా? కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా?’ అంటూ మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి పోలీసు శాఖపై నిప్పులు చెరిగింది.

ఒక నేత దాఖలు చేసిన పిటిషన్‌లో పూర్తి వివరాలను హైకోర్టు ముందుంచేందుకు సమయం తీసుకున్న పోలీసులు, దానిని అడ్డం పెట్టుకుని ఆ వెంటనే కింది కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘వివరాలు సమర్పించేందుకు సమయం తీసుకుని చార్జిషీట్‌ ఎలా దాఖలు చేస్తారు? ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే. పోలీసులు, కలెక్టర్‌కు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది.

పోలీసులు, కలెక్టర్‌ను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వివరాల సమర్పణ కోసం పోలీసులు సమయం కోరినప్పుడు, కోర్టు సమయం ఇవ్వడం పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. పోలీసులు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అధికారులు ఇల్లు కూల్చి వేస్తున్నారంటూ కక్షిదారుడు పిటిషన్‌ దాఖలు చేస్తే.. వివరణ సమర్పణ కోసం గడువు తీసుకుని ఆ ఇల్లు కూల్చేసినట్లుగా ఉంది పోలీసుల తీరు’ అని హైకోర్టు మండిపడింది. ఫలితంగా ప్రత్యర్థులే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 

జీపీ ప్రభుత్వ మౌత్‌పీస్‌ కాకూడదు 
హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) జయంతి తీరుపై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి కొన్ని ప్రమాణాలు ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ ప్రతినిధిగా (మౌత్‌పీస్‌) వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది ఉన్నది కోర్టుకు సహకరించేందుకే తప్ప ప్రభుత్వానికి పోస్టు మ్యాన్‌గా ఉండేందుకు కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆఫీసర్‌ అన్న సంగతి మర్చిపోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి స్పందిస్తూ.. కేసును విచారణకు స్వీకరించాలా? లేదా అన్నది కింది కోర్టు పరిధిలోని వ్యవహారమన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రయల్‌లో తేల్చాల్సి ఉంటుందని తెలిపారు. అధికరణ 226 కింద హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వాదనను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అధికరణ 226 కింద హైకోర్టు అధికారాలకు ఆకాశమే హద్దని స్పష్టం చేసింది. మూడేళ్లు శిక్షపడే కేసుల్లో మూడేళ్ల తర్వాత ఆ కేసును కోర్టు విచారణకు స్వీకరించడంపై చట్ట ప్రకారం నిషేధం ఉందని గుర్తు చేసింది.

ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషనా?
2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై మంత్రి హోదాలో కొడాలి నాని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి గుడివాడ పోలీసులకు 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అప్పటి కేసుపై ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిని కొట్టేయాలని కోరుతూ నాని ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

నాని తరఫున సీనియర్‌ న్యాయవాది చిత్తర్వు రఘు మంగళవారం వాదనలు వినిపించారు. 2021లో కేసు నమోదైతే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనన్నారు. నానిపై నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించే గడువు ఎప్పుడో ముగిసిందని తెలిపారు. అందువల్ల సీఆర్‌పీసీ ప్రకారం కొడాలి నాని ప్రాసిక్యూషన్‌ చెల్లదన్నారు. వివరాల సమర్పణకు మొన్న (28వ తేదీ) గడువు తీసుకున్న పోలీసులు, నిన్న (29న) చార్జిషీట్‌ దాఖలు చేశారని వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. నానిపై నమోదైన కేసులో మూడేళ్ల శిక్ష మాత్రమే పడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో మూడేళ్లు దాటిన తర్వాత ఆ కేసును కోర్టులు విచారణకు స్వీకరించలేవని స్పష్టం చేసింది.

మూడేళ్ల తరువాత కేసును విచారణకు స్వీకరించడంపై క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లో స్పష్టమైన నిషేధం ఉందని తెలిపింది. 2021లో జరిగిన ఘటనపై తాజాగా పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారని, ఆ చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించడానికి వీలు ఉండదని గుర్తు చేసింది. నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 18న జారీ చేసిన జీవో 801, తదనుగుణంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ జూన్‌ 25న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నిలిపేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement