AP: అంగన్‌వాడీ’లకు తీపికబురు | Andhra Pradesh Govt Good news that promotions for Anganwadi Workers | Sakshi
Sakshi News home page

AP: అంగన్‌వాడీ’లకు తీపికబురు

Feb 21 2022 3:35 AM | Updated on Feb 21 2022 1:28 PM

Andhra Pradesh Govt Good news that promotions for Anganwadi Workers - Sakshi

సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంగన్‌వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదోన్నతుల కోసం ఎనిమిదేళ్ల వీరి నిరీక్షణకు తెరదించి అందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే, ప్రస్తుతమున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు సైతం అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వీరికి పదోన్నతులు కల్పించాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 560 విస్తరణాధికారులు (ఈఓ) గ్రేడ్‌–2 (సూపర్‌వైజర్లు) పోస్టులు వీరితో భర్తీకానున్నాయి. నిజానికి.. రాష్ట్రంలో మంజూరైన మొత్తం గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులు 976 ఉన్నాయి. వాటిలో 416 పోస్టులను గతంలో భర్తీచేశారు. అంగన్‌వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీచేస్తారు. వచ్చే మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడుతుంది.

అంగన్‌వాడీ వర్కర్ల చేతికి ’స్మార్ట్‌ ఫోన్‌’
ఇక రాష్ట్రంలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వర్కర్ల చేతికి ప్రభుత్వం కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనుంది. 55,607 అంగన్‌వాడీ వర్కర్లు, 1,377 సూపర్‌వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్‌ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్‌ ఖరీదు రూ.14,998 కాగా, మొత్తం రూ.85.47 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

గత సర్కారు వీరిని నిర్లక్ష్యం చేసింది
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు విశేష సేవలందిస్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం తరఫున తమ వంతు సేవలు చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్ల మేలు కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక  గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లకు గ్రేడ్‌–1 సూపర్‌వైజర్లుగాను, గ్రేడ్‌–1 సూపర్‌వైజర్లకు సీడీపీఓలుగాను, సీడీపీఓలకు ఏపీఓలుగాను పదోన్నతులు కల్పించాం. ఇప్పుడు అంగన్‌వాడీ వర్కర్లకు గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం వీరిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంగన్‌వాడీ వర్కర్ల పదోన్నతుల విషయంలో వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది.  
– తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి

పారదర్శకంగా పదోన్నతులు
అంగన్‌వాడీ వర్కర్లకు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. 2013లో వీరికి పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత ఇప్పటిదాకా లేవు. అప్పటి నుంచి ఉన్న ఖాళీలను అర్హులైన అంగన్‌వాడీ వర్కర్లతో భర్తీ చేయాలనే డిమాండ్‌ ఉంది. వీరి విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పదోన్నతులకు ఆమోదం తెలిపింది. దీనికి మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఏపీపీఎస్‌సీ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది.  
– కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement