Andhra Pradesh: ఇదిగో మార్పు..

Andhra Pradesh Govt Focus On education medicine and agriculture - Sakshi

ఇదివరకెన్నడూ లేని విధంగా సామాజిక మౌలిక వసతులకు భారీగా వ్యయం రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో పెద్ద ఎత్తున వెచ్చింపు

ఈ రంగాల్లో సామాజిక ఆస్తుల కల్పనకు ఏకంగా రూ.55,597 కోట్లు 

ఇప్పుడు ఏ గ్రామం వెళ్లినా కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న మార్పు 

సచివాలయం, హెల్త్‌ క్లినిక్, ఆర్‌బీకే, డిజిటల్‌ లైబ్రరీ, ఇంగ్లిష్‌ మీడియం స్కూలు

విద్యా రంగంలో నాడు–నేడుతో మౌలిక వసతులకు రూ.16,450.69 కోట్లు

తొలి దశలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూళ్లు సర్వాంగ సుందరం 

రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో కొనసాగుతున్న పనులు 

వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.16,822 కోట్లు 

17 కొత్త మెడికల్‌ కాలేజీలు.. అదనంగా మరో 2,100 సీట్లు

ఈ ఏడాది నుంచి ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు

ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీల్లో రిపేర్లు, మౌలిక సదుపాయాల కల్పన

10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌.. 528 వార్డు హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణం ముమ్మరం 

కొత్తగా 150 పీహెచ్‌సీలు.. 992 పీహెచ్‌సీల ఆధునికీకరణ

వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.17,000 కోట్లు

10,893 గ్రామ సచివాలయాలు, 10,216 రైతు భరోసా కేంద్రాలు

అభివృద్ధి, సామాజిక రంగం వ్యయం పెరుగుతోందని ఆర్‌బీఐ వెల్లడి

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలి­సారిగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభు­త్వం పెట్టపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ముఖ్యంగా గ్రా­మీణ ప్రజలకు అవసరమైన కనీస సామా­జిక మౌలిక వసతులను ప్రభుత్వ రంగంలో కల్పి­స్తోంది. ఇందుకు ఏకంగా రూ.55,597 కోట్లు వ్యయం చేస్తోంది. త­ద్వారా గ్రామీణ ముఖ చిత్రంలో సమూల మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

ఒక పక్క దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని గత చంద్రబాబు సర్కారు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ఆ రంగాల్లో ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కనీస సామాజిక బాధ్యతగా ఆయా రంగాల్లో ప్రజలకు, రైతులకు అవసరమైన సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో  మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యయం చేస్తోంది.

ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు సచివాలయం కనిపిస్తోంది. అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. మరో నాలుగు అడుగులు వేస్తే డిజిటల్‌ లైబ్రరీ.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ సాక్షాత్కారిస్తోంది. ఇప్పుడు ఏ గ్రామం వెళ్లినా ఈ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 

విద్యా రంగంలో రూ.16,450.59 కోట్ల వ్యయం 
మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 61,661 స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు ఏకంగా రూ.16,450.69 కోట్లు వ్యయం చేసేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే తొలి దశలో 15,713 స్కూళ్లలో రూ.3,697.86 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఈ స్కూళ్లన్నీ 10 రకాల వసతులతో కార్పొరేట్‌ స్కూళ్లను మించి సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్లలో రూ.8,000 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు.

తొలి దశలో ఆయా గ్రామాల్లో రూపు రేఖలు మారిన స్కూళ్లను చూస్తే.. గతానికి, ఇప్పటికి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సకల మౌలిక వసతులు సమకూర్చిన స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్‌ తరగతులు ప్రారంభిస్తున్నారు. దశల వారీగా గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నారు. తొలి దశలో రూ.575 కోట్ల వ్యయంతో 3,589 డిజిల్‌ లైబ్రరీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. పట్టణాల నుంచి సొంతూరు వెళ్లినా, అక్కడి నుంచే పనిచేసేలా డిజిటల్‌ లైబ్రరీలను చేపడుతున్నారు.
 
చూడ ముచ్చటగా స్కూళ్లు
చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేక ఆడ పిల్లలు అనేక అవస్థలు పడ్డారు. రేకులు, దుప్పట్లు అడ్డుపెట్టుకునే పరిస్థితులుండేవి. శిథిలమైన బడులు ఆ బడులను కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా దీర్చిదిద్దుతున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, సురక్షిత మంచినీటి వసతి, విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ఫర్నీచర్‌తో పాటు ప్రహరీ.. తదితర మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ బడులు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి.

తొలి దశ స్కూళ్లలో వచ్చే జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌తో పూర్తిగా డిజిటల్‌ క్లాసు రూములుగా దర్శనమివ్వనున్నాయి. నాడు–నేడు పేరుతో విద్యా సంస్థల్లో చేపట్టిన పనుల వ్యయం సామాజిక పెట్టుబడిగా.. ప్రజల ఆస్తులుగా పరిగణించాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వ రంగంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చేరికలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయనడానికి పెరిగిన చేరికలే నిదర్శనం. ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్‌ఈ ఇంగ్లిష్‌ మీడియంతో తీర్చిదిద్దుతున్నారు. ఇవి వచ్చే తరం పిల్లల భవిష్యత్‌ కోసం మన ప్రభుత్వం తీసుకువస్తున్న గొప్ప మార్పుగా విద్యా వేత్తలు అభివర్ణిస్తున్నారు. 

ప్రజారోగ్యంలో భారీ మౌలిక సౌకర్యాలు 
► నాడు–నేడు పేరుతో వైద్య రంగంలోనూ కొత్తగా ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు, ప్రస్తుతం ఉన్న మెడికల్‌ కాలేజీల ఆధునికీకరణ, విలేజ్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణం, స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.16,822 కోట్లు వ్యయం చేస్తోంది. 

► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఐదు కాలేజీల నిర్మాణం 90 శాతం పైగా పూర్తయింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు (ప్రభుత్వ కళాశాలల్లో) ఉంటే కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్‌ కాలేజీల ద్వారా అదనంగా 2,100 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 

► ఇప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీల ఆధునికీకరణతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో గతంలో ఏ సర్కారు కూడా ఇన్ని మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. 

10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌
► గ్రామ, వార్డు స్థాయిలో క్లినిక్స్‌ ఏర్పాటు చేసి ప్రజల ముగింటకే ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్, 528 వార్డు హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్తగా 150 పీహెచ్‌సీలతో పాటు 992 పీహెచ్‌సీలు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. 

► గత చంద్రబాబు సర్కారు వైద్య విద్యా రంగాలల్లో ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటే ఇప్పుడు జగన్‌ సర్కారు ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ సామాజిక బాధ్యను నెరవేరుస్తోంది. 

రూ.17 వేల కోట్లతో వ్యవ‘సాయం’
► దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లోని అత్యధిక ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే. అలాంటి రైతులకు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేస్తోంది. విత్తనం నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్‌ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

► రూ.2269.30 కోట్లతో రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 4095 పూర్తయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అన్ని మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.17 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులను చేపడుతున్నారు. మొత్తం 30 రకాల పనులు చేపడుతున్నారు.

► సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్‌ రూమ్‌లు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేపడుతున్నారు. డ్రై స్టోరేజీ– డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్‌లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, అసేయింగ్‌ ఎక్విప్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఈ– మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్‌ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, వరి పండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్‌ హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్‌ఫ్రా, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాససింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

► పాడి రైతుల కోసం ఇప్పటికే తొలి దశలో రూ.399.01 కోట్లతో 2,535 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టారు. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడి రైతులు పోసే పాల ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. తద్వారా ప్రైవేట్‌ డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్ధితిని తీసుకువచ్చారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులకు ఇంత వ్యయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. 

సచివాలయాలు సామాజిక ఆస్తి 
► గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందించేందుకు రూ.4,750 కోట్ల వ్యయంతో 10,893 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఇప్పటికే 5,926 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా ఆయా గ్రామాల ప్రజల సామాజిక ఆస్తిగా నిలిచిపోనున్నాయి. 

► రాష్ట్రంలో వైఎస్‌  జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఆయా గ్రామాల్లోని  1.34 లక్షల మంది యువతీ యువకులు శాశ్వత ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ప్రతి సచివాలయంలోనూ గ్రామ స్థాయిలోనే దాదాపు 600 పౌర సేవలు ఎటువంటి లంచాలు, వివక్షకు తావులేకుండా అందుతున్నాయి.
 
అభివృద్ధి వ్యయం రయ్‌.. రయ్‌..
రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం ఏటేటా తగ్గుతోంది. సామాజిక, కమ్యూనిటీ సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నేరుగా సంబంధించిన కార్యకలాపాలపై చేసే వ్యయమే అభివృద్ధి వ్యయం. ఉదాహరణకు వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చు అభివృద్ధి వ్యయమే.

రాష్ట్రంలో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వల గిడ్డంగులు సామాజిక రంగ సేవల కిందకు వస్తాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య రంగాల వ్యయం పెరుగుతోంది.
– 2020–21 ఆర్థిక ఏడాది నుంచి 2022–23 ఆర్థిక ఏడాది వరకు ఆర్థిక సూచికలపై ఆర్బీఐ అధ్యయన నివేదిక 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top