వడివడిగా ‘అమూల్‌’ అడుగులు

Amul Is Making Strides To Launch Its Operations In AP As Well - Sakshi

ఒంగోలు, కంకిపాడులో ప్లాంట్లు

సహకార డెయిరీ ప్లాంట్ల వినియోగంపైనా దృష్టి

సాక్షి, అమరావతి: అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) తన కార్యకలాపాలను మన రాష్ట్రంలోనూ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న ఆ సంస్థ గుజరాత్‌ నుంచి ఇక్కడి సహకార శాఖ అధికారులకు ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను అధ్యయనం చేసి తొలిగా కంకిపాడు, ఒంగోలులో డెయిరీ ప్లాంట్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతులకు మంచి ధర, ఆన్‌లైన్‌లో చెల్లింపులు, పశువులకు నాణ్యమైన మేత, చికిత్స అందించేలా వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది. 

రైతు పరిస్థితులు గుర్తించి..
అమూల్‌కు చెందిన సాంకేతిక బృందం సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పాడి పరిశ్రమ స్థితిగతులను అధ్యయనం చేసింది. ఈ బృందంలో అమూల్‌ జీఎం హిమాన్షు పి.రాథోడ్, పశు వైద్యులు, పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ విభాగాలకు చెందిన 22 మంది నిపుణులు ఉన్నారు. వీరు మూడు బృందాలుగా ఏర్పడి.. మొదటి బృందం సాంకేతిక పరిస్థితులు, రెండో బృందం పాల సేకరణ, ధరలు, మూడో బృందం మార్కెటింగ్‌ పరిస్థితులను అధ్యయనం చేసింది. సహకార డెయిరీ ప్లాంట్లలోని యంత్ర పరికరాలు, వాటి సామర్థ్యం, అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సహకార డెయిరీ, కంకిపాడులోని డెయిరీ ప్లాంట్లను వెంటనే వినియోగించుకునే అవకాశాలు ఉండటంతో తొలిగా వాటిల్లో కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించింది.  కృష్ణాజిల్లా కంకిపాడులోని డెయిరీ ప్లాంట్‌ నుంచి  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తించి దీనిని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది.

పాడి పరిశ్రమకు మంచి రోజులు 
రాష్ట్రంలోని పాడి పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. అమూల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పాలను విక్రయించే మహిళా సభ్యులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. నగదు చెల్లింపులు, పశువులకు నాణ్యమైన దాణా, వైద్యం అందించడానికి అనువుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
– వాణీమోహన్, ఎండీ, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top