
నా వద్ద 15లోపు థియేటర్లే ఉన్నాయి
నిర్మాత అల్లు అరవింద్
‘ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటాదేంటి’ అని గతంలో పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు
‘ప్రభుత్వం సంబంధం ఏమిటి.. మాది ప్రైవేట్ వ్యాపారం’అనడం సరికాదన్న అరవింద్
పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యల్ని అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉందంటున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైమ్ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్‌లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్‌లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్‌లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది.
ఇక ఈ థియేటర్స్ క్లోజ్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్‌కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్‌కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు.
పవన్‌కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్ సినిమా విషయంలో పవన్‌ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్ చాంబర్ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను.
ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్ మినిస్టర్‌ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్ వ్యాఖ్యానించారు.
పవన్ వ్యాఖ్యల్ని అరవింద్ ఖండించారంటున్న నెటిజన్లు
‘ప్రైవేట్ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది.
ప్రభుత్వం కో–ఆపరేషన్ కావాలి’అంటు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను జతచేసి సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేస్తున్నారు.