బినామీలకు ‘పర్యాటకం’! | Allocation of Valuable Land Parcels for Tourism Projects: Andhra pradesh | Sakshi
Sakshi News home page

బినామీలకు ‘పర్యాటకం’!

May 8 2026 4:58 AM | Updated on May 8 2026 4:58 AM

Allocation of Valuable Land Parcels for Tourism Projects: Andhra pradesh

పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాల కేటాయింపు

ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తులకు సైతం పందేరం

భవానీ ద్వీపంలో విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అవెన్యూస్‌ పాగా

లీజు రద్దు చేసి విశాఖ పోర్టు అథారిటీ గెంటేసిన సంస్థకు బాబు సర్కారు రెడ్‌ కార్పెట్‌

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ కుటుంబానికి, బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు బరి తెగించి వ్యవహరిస్తున్నారు. పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూములను బినావీులకు విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు. ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తులను సైతం భారీ పెట్టుబడిదారులుగా చిత్రీకరిస్తూ వారికి ప్రాజెక్టులు, స్థలాలు కట్టబెట్టి ప్రజలను మోసగిస్తున్నారు. రాజధాని పరిసరాల్లో విలువైన ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సినవారే పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెడుతున్న తీరు ఇలా ఉంది..!

విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు..
విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 2023లో విశాఖ పోర్టు అథారిటీకి చెందిన స్టేడియాన్ని లీజుకు తీసుకుని రెండున్నరేళ్లకు పైగా రెంట్‌ చెల్లించకుండా ఎగ్గొట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, భద్రత లేకుండా స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ నిర్వహించడంతో ఓ చిన్నారి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందింది. దీనిపై పోర్టు యాజమాన్యం థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించగా, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేలింది. లీజు చెల్లించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, స్థలాలను అన్యాక్రాంతం చేయడంతో 12 నోటీసులు జారీ చేసిన పోర్టు యాజమాన్యం లీజును రద్దు చేసింది. విశ్వనాథ్‌ కంపెనీ ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలను సైతం నగదుగా మార్చుకోవడం గమనార్హం. 

దీంతో విశ్వనాథ్‌ కంపెనీ ఆర్థికంగా దివాళా తీసిన దశకు చేరుకుని పోర్టు స్థలాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ తీరంలో ఏపీటీడీసీకి చెందిన ‘బీచ్‌ షాక్స్‌’ (తాత్కాలిక నిర్మాణాలు) నిర్వహణ నుంచి సైతం విశ్వనాథ్‌కు చెందిన కంపెనీని తొలగించారు. ఇక్కడ విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు 
వినియోగించినట్లు తేలడంతో ఆ లీజును రద్దు చేశారు. దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అలాంటి సంస్థకు చంద్రబాబు సర్కార్‌ రూ.వేల కోట్ల విలువైన భవాని ద్వీపాన్ని దోచిపెడుతోంది. 

గతంలోనూ కుట్రలు..
గతంలో కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష అసోసియేట్స్‌ ఫిషింగ్‌ లిమిటెడ్‌ సంస్థకు భవానీ ద్వీపాన్ని 55 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు విఫలయత్నం జరిగింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజాపోరు దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చింది. మళ్లీ పుష్కరకాలం తర్వాత మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ద్వారా టీడీపీ పెద్దలు కథ నడిపిస్తుండటం గమనార్హం. గంటా శ్రీనివాసరావు బినామీగా బహిరంగంగానే గుర్తింపు పొందిన కాశీ విశ్వనాథ్‌ను రంగంలోకి తెచ్చారు.  ఆర్థికంగా దివాళా తీసి, గతంలో లీజులు రద్దు అయిన కంపెనీకి భవాని ద్వీపాన్ని కట్టబెట్టే స్కెచ్‌ వేశారు. రెండేళ్లుగా భవాని ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారు. ఫలితంగా ద్వీపం అస్తవ్యస్తంగా తయారైంది. 

సామాన్యులకు ప్రవేశం దుర్లభం!
భవానిద్విపం కాశీ విశ్వనాథ్‌ కంపెనీ చేతుల్లోకి వెళితే సామాన్యులకు ప్రవేశం కలగానే మిగలనుంది. బోటు ఎక్కి ద్వీపంలో దిగి, హాయిగా విహరించే పరిస్థితి ఉండదు. ఇందుకు విశాఖ పోర్టు అథారిటీ స్టేడియమే పెద్ద ఉదాహరణ. అక్కడ విశ్వనాథ్‌ కంపెనీ అడుగు పెట్టకముందు విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున పోర్టు మైదానంలో రోజూ వాకింగ్, వ్యాయామాలు చేసుకునేవారు. పోర్టు అథారిటీ ఆ స్థలాన్ని విశ్వనాథ్‌ కంపెనీకి లీజుకు ఇవ్వడంతో మైదానాలకు వెళ్లే మార్గాలను మూసివేశారు. స్టేడియంలో అనధికారిక నిర్మాణాలు చేపట్టారు. ఏటా రూ.కోట్లలో ఆదాయాన్ని గడించి రెండున్నరేళ్లకుపైగా లీజు చెల్లించకుండా ఎగ్గొట్టేశారు. పోర్టును తమ సొంత జాగీరులా వాడుకుని సామాన్యులకు ప్రవేశాన్ని నిలిపివేశారు.

పోర్టు అథారిటీ మెడపట్టి గెంటేసింది
బాబు సర్కార్‌ రమ్మని పిలుస్తోంది..
విజయవాడలో దుర్గమ్మ చెంతన ఉన్న భవానీ ద్వీపం ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఇంద్రకీలాద్రికి మణిహారంలా భాసిల్లుతోంది. దాదాపు 230 ఎకరాల్లో విస్తరించిన భవానీ ద్వీపం విలువ సుమారు రూ.4,600 కోట్లు..! అలాంటి భవానీ ద్వీపాన్ని చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌ పరం చేస్తోంది. విశాఖలోని కాశీ విశ్వనాథ్‌కు చెందిన విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ ప్రైవేటు లిమిటెడ్, విశ్వనాథ్‌ అవెన్యూస్‌(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలకు ‘అడ్వెంచర్‌ థ్రిల్‌ సిటీ’ పేరుతో కట్టబెడుతోంది. ఇప్పటికే తొలిదశలో పది ఎకరాలు కేటాయించింది. రూ.51.48 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉపాధి లభిస్తుందంటూ మభ్యపుచ్చింది. ఇదే విశ్వనాథ్‌ కంపెనీని విశాఖ పోర్టు అథారిటీ లీజు రద్దు చేసి మెడపట్టి బయటకు గెంటేయడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement