
సాక్షి, నంద్యాల: చంద్రబాబు రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.
ఇటీవల,నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ హుకుం జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు తామేం తక్కువేం తినలేదంటూ టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అఖిల ప్రియ మహిళా అనుచరులు రెచ్చిపోతున్నారు.
చికెన్ కోళ్లను తమవద్దే కొనాలంటూ వ్యాపారస్తులకు హూకుం జారీ చేస్తున్నారు. చికెన్ కోళ్లను తమ వద్ద కొనుగోలు చేయకపోతే చికెన్ సెంటర్లను మూసేస్తామని బెదిరిస్తున్నారు. కేజీ చికెన్ మీద రూ.20 రూపాయిలు కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఈ క్రమంలో తాము చిరు వ్యాపారులమని, కమిషన్లు ఇచ్చుకుంటూ పోతే..తమ కుటుంబ పోషణ భారమవుతుందటూ చికెన్ షాపు వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల ఆగడాలపై వ్యాపారస్తులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కేజీకి రూ.20 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, కోళ్లను తమ దగ్గరే కొనుగోలు చేయాలంటూ టీడీపీ నేతల ఆగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు దౌర్జన్యాలు భరించలేక జిల్లా ఎస్పీని కలిసిని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరి చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.