ఆలోచనశక్తికి ఏఐ వైరస్‌ | AI laziness is growing among students | Sakshi
Sakshi News home page

ఆలోచనశక్తికి ఏఐ వైరస్‌

Oct 10 2026 5:45 AM | Updated on Oct 10 2026 5:45 AM

AI laziness is growing among students

విద్యార్థుల్లో పెరుగుతున్న ఏఐ లేజీనెస్‌    

ఉన్నతవిద్య విద్యార్థులు అత్యధికంగా ఏఐ పైనే ఆధారం  

దేశంలో 4.50 కోట్ల మంది ఉన్నతవిద్య విద్యార్థుల్లో 3.50 కోట్ల మంది వినియోగం  

వేగంగా పెరుగుతున్న కాగ్నిటివ్‌ ఆఫ్‌–లోడింగ్‌  

సహజ, స్వతంత్ర ఆలోచనశక్తి తగ్గిపోతోందని ఆందోళన  

డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్, చీగ్‌ సంస్థల గ్లోబల్‌ అలర్ట్‌  

సాక్షి, అమరావతి: సైన్స్‌ ప్రాజెక్టా? కృత్రిమ మేధ సిద్ధంగా ఉంది. వ్యాసం రాయాలా? ఏఐ సెకన్లలో రాసిచ్చేస్తుంది. కోడింగ్‌ ఎర్రరా? టూల్‌ సరిచేస్తుంది. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం విద్యారంగాన్ని పరుగులు పెట్టించడం నిజమే అయినా.. దానికి సమాంతరంగా విద్యార్థుల స్వతంత్ర ఆలోచనశక్తికి గండికొడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల చేతికి వచ్చిన సరికొత్త ‘కాగ్నిటివ్‌ ఆఫ్‌–లోడింగ్‌’ (మెదడు చేయాల్సిన ఆలోచనను మెషీన్‌కు అప్పగించే ధోరణి) యువతరాన్ని ఆలోచనశక్తి హీనులుగా మార్చేస్తోందంటున్నారు. ఇది భవిష్యత్‌ తరాలను వేగంగా ప్రమాదంలోకి నెడుతోందని ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న అధ్యయనాలు, సర్వేలు హెచ్చరిస్తున్నాయి. 

అంతర్జాతీయ విద్యాసంస్థలు, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ–సింగపూర్‌), చీగ్‌ గ్లోబల్‌ (యూఎస్‌ఏ) నివేదికల ప్రకారం ఉన్నతవిద్య విద్యార్థుల్లో జనరేటివ్‌ ఏఐ సాధనాల వినియోగం శరవేగంగా పెరిగింది. మనదేశంలోను ఇంజినీరింగ్‌ విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 50 శాతం మంది విఫలమవడానికి కారణం ఏఐపై అధికంగా ఆధారపడడమేనని చెబుతున్నారు. మెదడును శ్రమపెట్టే విద్యార్థే భవిష్యత్తులో సాంకేతికతను నడిపిస్తాడని, లేదంటే సాంకేతికతే ఆ విద్యార్థిని నడిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ఏఐ వినియోగం  
కొత్తగా అరచేతిలోకి వచ్చిన కృత్రిమ మేధ మనుషుల మేధస్సును తుస్సుమనిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల్లో తమ మెదడుకు పనిచెప్పకుండా, ఆలోచనకు పదును పెట్టకుండా సులభంగా పనిపూర్తయ్యే మార్గాల కోసం ఏఐని ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతున్నట్టు డీఈసీ సర్వేలో వెల్లడైంది. హోంవర్క్‌ చేసేందుకు, ప్రాజెక్టుల కోసం, అసైన్‌మెంట్లు, అనువాదాలు, పరీక్షల సన్నద్ధత, అకడమిక్‌ పేపర్ల ఎనాలసిస్‌.. ఇలా ఒకటేంటి అన్నింటికీ జనరేటివ్‌ ఏఐ సాధనాలపై ఆధారపడుతున్నట్టు గుర్తించారు. 

ఈ విధానం ఎక్కువగా, యూకే, లాటిన్‌ అమెరికా, భారత్, యూఎస్‌ఏ, యూరప్‌ దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుసలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 92–95 శాతంతో మొదటిస్థానంలో ఉండగా మనదేశం 86–89 శాతంతో మూడోస్థానంలో ఉంది. యూకేలో అసైన్‌మెంట్లు, రీసెర్చ్‌ సారాంశాలు, కాన్సెప్ట్‌ క్లారిటీ కోసం, బ్రెజిల్, మెక్సికో వంటి లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రాజెక్టులు, అనువాదాలు, హోంవర్క్‌ కోసం ఏఐని వాడుతుండగా, భారతదేశంలో కోడింగ్‌ సమస్యలు, పరీక్షల సన్నద్ధత, ప్రాజెక్టుల కోసం, అమెరికాలో వ్యాసాలు, బ్రెయిన్‌ స్టార్టింగ్, క్విజ్‌ ప్రిపరేషన్‌ కోసం, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్‌ దేశాల్లో థీసిస్‌ రీసెర్చ్, అకడమిక్‌ పేపర్ల తయారీకి వాడుతున్నారు.

శాతాల పరంగా బ్రిటన్‌ మొదటిస్థానంలో ఉన్నప్పటికీ.. సంఖ్యాపరంగా చూస్తే భారతదేశమే ప్రపంచంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తోంది. దేశంలో ఉన్న సుమారు 4.3 కోట్లమంది ఉన్నతవిద్య విద్యార్థుల్లో ఏకంగా 3.5 కోట్ల మందికిపైగా రోజూ లేదా వారానికి పలుమార్లు ఏఐని వాడుతున్నట్టు తేలింది. యూఎస్‌లో ఈ సంఖ్య 1.4 కోట్లు ఉండగా, యూకేలో సుమారు 20 లక్షల వద్ద ఉంది.  

ఆలోచన శూన్యం.. క్యాంపస్‌లలో వైఫల్యాలు: 
జనరేటివ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యార్థుల్లో స్వంతంగా శోధించి నేర్చుకునే సంస్కృతి తగ్గిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇది మానవ మేధస్సును నాశనం చేస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషయ పరిజ్ఞానం పెంచుకోకుండా కాపీ–పేస్ట్‌ సంస్కృతి విస్తరిస్తోందంటున్నారు. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యయనాల ప్రకారం ప్రతి పదిమంది విద్యార్థుల్లో ఆరుగురు (60 శాతం) ఏఐ ఇచ్చిన ఫలితాలను క్రాస్‌చెక్‌ చేయకుండా నేరుగా సబ్మిట్ చేస్తున్నారు. విద్యార్థులు స్వయంగా గ్రంథాలయాలు, పుస్తకాల్లో చదివి పరిశోధన చేసే సమయం గతంతో పోలిస్తే సుమారు 45 శాతం తగ్గింది.  

» కాగ్నిటివ్ ఇంపాక్ట్‌ స్టడీస్‌ ప్రకారం.. నిరంతరం ఏఐ టూల్స్‌పై ఆధారపడే విద్యార్థుల్లో సమస్య పరిష్కార సామర్థ్యం, సమాచారాన్ని నిలుపుకొనే జ్ఞాపకశక్తి సాధారణ విద్యార్థుల కంటే 20–25% తగ్గుముఖం పడుతోంది.  

» కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌ సర్వేల ప్రకారం, దేశవ్యాప్తంగా క్యాంపస్‌ డ్రైవ్‌లలో పాల్గొనే భారతీయ ఐటీ, ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో 40–50 శాతం మంది ముఖాముఖి ఇంటర్వ్యూలలో ప్రాథమిక లాజిక్, మాన్యువల్‌ కోడింగ్‌ రాయడంలో విఫలమవుతున్నారు. కాలేజీల్లో ఆటోమేటెడ్‌ కోడ్‌ జెనరేషన్‌ టూల్స్‌ వాడటం వల్ల, మొదటి నుంచి సొంతంగా లాజిక్‌ నిర్మించే ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తోందని, దీంతో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఇంటర్వ్యూలలో తేలిపోతున్నారని చెబుతున్నారు.   

» ఏఐ టూల్స్‌ కొన్నిసార్లు ఉనికిలో లేని తప్పుడు సమాచారాన్ని (ఏఐ హాలూసినేషన్‌) కూడా సరైనదేనన్నట్లు భ్రమింపజేస్తాయని, సర్వేల ప్రకారం 55 శాతం మంది విద్యార్థులు ఆ ఆధారాలను ధ్రువీకరించుకోకుండానే తమ ప్రాజెక్టుల్లో జోడిస్తున్నారని గుర్తించారు.  

భారత విద్యావ్యవస్థకు సవాళ్లు  
యూకే, యూఎస్‌ వంటి దేశాల్లో ఏఐ అకాడమిక్‌ ఎథిక్స్, డిటెక్షన్‌ సాఫ్ట్‌వేర్ల వినియోగం ఇప్పటికే మొదలైంది. భారత్‌లో సీబీఎస్‌ఈ, యూజీసీ వంటి విద్యామండళ్లు మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తీవ్ర అంతరాలున్నాయి. విద్యార్థులకు ఇచ్చిన హోంవర్క్, అసైన్‌మెంట్లు నిమిషాల్లో పూర్తవుతుండటంతో అసలైన ప్రతిభను గుర్తించడం అధ్యాపకులకు పెద్ద సవాలుగా మారింది. దేశంలోని 80 శాతం విద్యాసంస్థల్లో సరైన ఏఐ–డిటెక్షన్‌ వ్యవస్థలు అందుబాటులో లేవు. పాశ్చాత్య దేశాల్లో విద్యార్థులు ఆలోచనలకు మెరుగులు దిద్దుకోవడానికి ఏఐని వాడితే, భారత్‌లో ఇంకా చాలామంది విద్యార్థులు శ్రమను తప్పించుకునే ‘షార్ట్‌కట్‌’గా మాత్రమే చూస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని పరిష్కారమార్గాలను అనుసరిస్తే విద్యార్థిని ‘మాస్టర్‌’గా నిలబెట్టవచ్చని పేర్కొంటున్నారు.  

»  ప్రాజెక్ట్‌ పేపర్లను మాత్రమే చూసి మార్కులు వేసే విధానానికి స్వస్తి పలకాలి. విద్యార్థి సమస్యను ఎలా పరిష్కరించాడు, ఏయే దశల్లో ఆలోచించాడు అనే దానిపై తరగతి గదిలో ప్రెజెంటేషన్లు, లైవ్‌ వైవా తప్పనిసరి చేయాలి.  

»  తరగతి గదిలోనే ఏఐని వాడటానికి అనుమతినిస్తూ.. ఆ టూల్‌ ఇచ్చిన సమాధానంలో ఉన్న తప్పులు, లోపాలు, హాలూసినేషన్లను గుర్తించమని (రివర్స్‌–లెర్నింగ్ ) విద్యార్థులకు టాస్‌్కలు ఇవ్వాలి. దీనివల్ల వారి విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్‌ థింకింగ్‌) మేల్కొంటుంది.  

»  వారానికి కనీసం 2–3 గంటలు ఎలాంటి డిజిటల్‌ పరికరాలు లేకుండా పెన్ను, పేపర్‌తో ఆలోచించడం, గ్రూప్‌ డిస్కషన్లు నిర్వహించడాన్ని విద్యాసంస్థలు తప్పనిసరి చేయాలి. అలా అని సాంకేతికతను నిషేధించడం దీనికి పరిష్కారం కాదని.. అలాగే అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదన్న వాస్తవాన్ని కూడా పాఠశాల దశలోనే తెలియజేయాలని చెబుతున్నారు. ఏఐని ఒక సహాయకుడిగా మాత్రమే చూడాలన్న స్పృహను విద్యార్థుల్లో కలిగించాలని సూచిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement