మార్కెట్లోకి ఆదిత్య బీజీ 2 పత్తి విత్తనం | Aditya BG-2 Cotton Seeds Hit the Marke: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ఆదిత్య బీజీ 2 పత్తి విత్తనం

Jun 5 2026 5:27 AM | Updated on Jun 5 2026 5:27 AM

Aditya BG-2 Cotton Seeds Hit the Marke: Andhra Pradesh

మార్కెట్‌ లో విడుదల చేసిన కొత్తరకం పత్తి విత్తనం – ఆదిత్య బీ జీ 2 పత్తి విత్తనం

సాగు చేసిన పంట నుంచే విత్తనం అభివృద్ధి చేసుకోవచ్చు 

పురుగు, తెగుళ్లను తట్టుకునే సామర్ధ్యం కలిగిన రకం

సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ–2208 (ఆదిత్య బీజీ–2)’విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్‌ పాలడుగు వెంకట సత్యనారాయణతో కలిసి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విత్తనాలను విడుదల చేశారు. ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.

జాతీయ విత్తన విడుదల కమిటీ ఆమోదంతో విడుదలైన ఈ రకం యూనివర్శిటీ అభివృద్ధి చేసిన తొలి బీటీ పత్తి రకం విత్తనం ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా సాగుకు అనుకూలంగా ఈ రకాన్ని సిఫారసు చేసినట్లు చెప్పారు.బీటీ సాంకేతికతపై పేటెంట్‌ హక్కులు ముగిసిన అనంతరం తొమ్మిదేళ్లపాటు శాస్త్రీయ పరిశోధనలు, అఖిల భారత స్థాయి పరీక్షలు నిర్వహించి ఈ రకాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ కొత్త విత్తనం ప్రత్యేకతలను శాస్త్రవేత్తలు వివరించారు. 

అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత 
లాం బీజీ టూ–2208 రకం హెక్టారుకు 32 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. మార్కెట్లో ఉన్న హైబ్రిడ్‌ రకాలతో సమానమైన దిగుబడిని ఇవ్వడంతో పాటు మెరుగైన దూది నాణ్యత ఉంది. ఇది సూటి రకం (వేరైటీ) కావడంతో రైతులు ప్రతి ఏటా కొత్త విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, తమ పొలాల్లో పండించిన పంట నుంచి విత్తనాన్ని భద్రపరచుకొని తిరిగి వినియోగించుకోవచ్చు.

ఈ రకం శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు వంటి కాయ తొలిచే పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక వంటి రసం పీల్చే పురుగుల ప్రభావాన్ని తగ్గించే లక్షణాలు ఉంది. బ్యాక్టీరియల్‌ బ్లైట్, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, వెర్రి తెగులు వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే సామర్థ్యం ఉండటంతో రైతులు పురుగు మందులు, తెగుళ్ల నివారణ మందులపై చేసే ఖర్చును తగ్గించుకోవచ్చు.  

ప్రత్యేక లక్షణాలు 
రకం : లాం బీజీ టూ –2208 (ఆదిత్య బీటీ–2) 
దిగుబడి : హెక్టారుకు 32–35 క్వింటాళ్లు 
కాయ బరువు : 5.5 నుంచి 6 గ్రాములు 
దూది పొడవు : 29.5 నుంచి 30 మి.మీ. 
దూది సున్నితత్వం : 4.3 నుంచి 4.6 మైక్రోనైర్‌ 
దూది బలం : 33.1 గ్రాములు/టెక్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement