సాగుకు సాంకేతిక సహకారం

Ada Dyndo says Technical Assistance for Cultivation - Sakshi

విశాఖలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తాం 

‘సాక్షి’తో ఐరోపా బిజినెస్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ సీఈవో అదా డైండో

సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయ రంగంలో సాంకేతిక అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పని చేస్తామని యూరోపియన్‌ బిజినెస్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఈబీటీసీ) సీఈవో అదా డైండో చెప్పారు. విశాఖలో ప్రారంభమైన జీ 20 గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌–2023లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో పలు అంశాల గురించి మాట్లాడారు. 

విశాఖలో భిన్నమైన అవకాశాలు.. 
విశాఖపట్నం చాలా అందంగా ఉంది. నగరంలో ఉన్న భిన్నమైన వాతావరణం కారణంగా అనేక రంగాల అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్‌ఆర్‌డీసీతో చేసుకున్న ఎంవోయూతో భవిష్యత్తులో ఈబీటీసీ విశాఖలోనూ పలు రంగాల్లో కలసి పని చేయనుంది. 

వ్యవసాయ రంగంపై ప్రధాన దృష్టి 
స్థిరమైన అభివృద్ధి, సాంకేతికత బదిలీ, ఆవిష్కరణ రంగాలలో ఐరోపా దేశాలు,  భారత్‌ మధ్య సహకారం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడంపై ఈబీటీసీ దృష్టిసారించింది. యూరోపియన్‌ వ్యవసాయ పద్ధతులు, విధానాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అందించాలని భావిస్తున్నాం. యూరప్‌ వ్యవసాయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా స్థిరమైన, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను మా దేశంలో అభివృద్ధి చేశాం. అత్యాధునిక సాంకేతికత, జీపీఎస్‌ ఆధారిత వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తున్నాం. 

దిగుబడులు పెరిగేలా డ్రోన్‌ వ్యవస్థ.. 
ఆంధ్రప్రదేశ్‌లో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. వీటికి ఐరోపా పద్ధతులు తోడైతే మరిన్ని సత్ఫ­లితాలు సాధించగలం. ఉదాహరణకు ఫీల్డ్‌ మ్యాపింగ్, రిమోట్‌æ సెన్సింగ్, డ్రోన్‌ల వినియోగం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఐరోపాలో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, సేంద్రియ వ్యవసాయం తోడైతే మంచి దిగుబడులు సాధ్యమవుతాయని విశ్వసిస్తున్నాం. 

విశాఖలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 
వ్యవసాయ రంగంలో పెద్ద ముందడుగు వేసేలా విశాఖపట్నంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఈబీటీసీ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ఏపీలోని రైతులకు అనేక అవకాశాలు కల్పించనున్నాం. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులు అవలంబించడం, ఎగుమతి ఆధారిత పంటలపై దృష్టిసారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top