చురుగ్గా 8,585 గ్రామ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం

Active Construction Of 8585 Village YSR Health Clinics - Sakshi

ఇప్పటికే బేస్‌మెంట్‌ స్థాయి పనులు దాటినవి 2,969

మార్చి నెలాఖరుకు మొత్తం నిర్మాణాలు పూర్తి

ఇక గ్రామీణ వైద్యంలో పెనుమార్పులు  

ప్రజలకు ఊళ్లోనే అందుబాటులోకి చికిత్స

సాక్షి, అమరావతి: గ్రామీణ వైద్యరంగంలో విప్లవాత్మకమార్పులు తెచ్చే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన మొత్తం 8,585 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం మార్చినాటికి పూర్తికానుంది.  దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఉన్న ఊళ్లోనే వైద్యసదుపాయాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తే జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రభుత్వపరంగానే వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం చిన్నచిన్న జబ్బులు వస్తే గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు, సమీప పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి.

ఈ పరిస్థితులను మార్చేసి గ్రామాల్లోనే జ్వరంతో పాటు ఇతర చిన్న అనారోగ్యాలకు చికిత్స అందించాలని ముఖ్యమంత్రి.. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాలను సమకూర్చాలని  నిర్ణయించారు. రూ.1,745 కోట్లతో రాష్ట్రంలో మొత్తం 10,030 గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 8,585 గ్రామ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లున్నాయి. ప్రతి స్పందన కార్యక్రమంలోను వీటి నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఈనెల 18న సీఎం నిర్వహించిన స్పందన కార్యక్రమం నాటికి 2,969 గ్రామాల్లో బేస్‌మెంట్‌ స్థాయి పైవరకు పనులు జరిగాయి. వచ్చే మార్చి నెలాఖరుకు నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాణ్యత లోపాలు లేకుండా,  సకాలంలో నిర్మాణాలు పూర్తిచేయడంపై జాయింట్‌ కలెక్టర్లు మరింత శ్రద్ధతీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు.

వైఎస్సార్‌ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తే..
► ప్రతి 2,500 మంది జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉంటుంది.
► చిన్నచిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన ఇబ్బందులు ఉండవు.
► ప్రతి క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ను నియమిస్తారు.
► ప్రస్తుతం ఉన్న ఏఎన్‌ఎంతోపాటు హెల్త్‌ అసిస్టెంట్, ఆశా వర్కర్లు క్లినిక్‌లో ఉంటారు.
► కనీసం 90 రకాల మందులు అందుబాటులో ఉంచుతారు.
► అన్నిరకాల వ్యాక్సిన్లు ఇక్కడే ఉంటాయి.
► గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top