
ఎస్‌బీఐని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం
ఇతర నోట్లతో కలప వద్దు..
సిట్ డిపాజిట్ చేసిన వీడియో, ఫొటోలు సమర్పించండి
ఇప్పటికే కరెన్సీ చెస్ట్‌కు తరలించారా.. లేక మీ దగ్గరే ఉన్నాయా?
తరలించేస్తే ఆ వీడియోలు, ఫొటోలు సమర్పించండి
తేదీ, సమయం వారీగా అన్ని రికార్డులు ఇవ్వండి
సాక్షి, అమరావతి: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్‌లో రూ.11 కోట్లు జప్తు పేరిట సిట్ ఆడిన డ్రామాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సిట్ జప్తు చేసిన నోట్ల కట్టల నిగ్గు తేల్చేందుకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచిలో సిట్ అధికారులు రూ.11 కోట్లు డిపాజిట్ చేసిన సీసీ టీవీ వీడియో ఫుటేజీలను భద్రపరచమని ఆదేశించింది. ఆ రూ.11 కోట్లు ఇంకా బ్యాంకులోనే ఉన్నాయా.. లేక కరెన్సీ చెస్ట్‌కు తరలించారా.. అన్నది స్పష్టం చేయాలని పేర్కొంది.
కరెన్సీ చెస్ట్‌కు తరలించినట్టయితే అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తేదీ, సమయం వివరాలతో సహా తెలియజేయాలని ఆదేశించింది. అందుకు సంబంధించిన స్టేట్‌మెంట్లు, లెడ్జర్లు, రికార్డులను కూడా న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది. తదనుగుణంగా తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో విస్పష్టంగా ప్రకటించింది. దీంతో సిట్ జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్ల హైడ్రామా కొత్త మలుపు తిరిగింది. సిట్ అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయమన్నది స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చూపేందుకు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపేందుకు సిట్ రూ.11 కోట్లు జప్తు చేసినట్టు కనికట్టు చేసింది. అందుకోసం వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి లొంగదీసుకుంది. వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా విజయేందర్ రెడ్డికి చెందిన హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్‌హౌస్‌లోకి తరలించారు. అనంతరం తనిఖీలో ఆ రూ.11 కోట్ల నగదును గుర్తించి జప్తు చేసినట్టు డ్రామా రక్తి కట్టించారు.
ఆ నగదు అంతా రాజ్ కేసిరెడ్డిదేనని.. ఆయన 2024 జూన్‌లోనే అక్కడ ఆ నగదును ఉంచారని కట్టు కథ వినిపించారు. సిట్ కుతంత్రాన్ని రాజ్ కేసిరెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకుగానీ, తన కుటుంబానికిగానీ ఎటువంటి సంబంధం లేదని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. ఆ నగదుకు సంబంధించి వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ యజమాని విజయేందర్ రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసినట్టు చెబుతున్న నోట్ల కట్టలపై ఉన్న ఆర్‌బీఐ బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఏసీబీ న్యాయస్థానం ఆ రూ.11 కోట్ల నగదు కట్టలను వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను శుక్రవారం ఆదేశించింది.
ప్రభుత్వ పెద్దలు, సిట్ బెంబేలు
ఈ పరిణామాలతో అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు సిట్ అధికారులు బెంబేలెత్తిపోయారు. ఆ రూ.11 కోట్ల నోట్ల కట్టలను ఆర్‌బీఐ అధికారులు పరిశీలిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. అందుకే న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సిట్ మరో కుట్రకు తెరతీసింది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ పోలీసులు బ్యాంకు ఖాతాలు నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో డిపాజిట్ చేసేయాలని ఎత్తుగడ వేసింది.
సిట్ కుట్రపై ఉప్పందడంతో రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు సత్వరం స్పందించారు. జప్తు చేశామని చెబుతున్న రూ.11 కోట్లను సిట్ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తద్వారా ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఎస్‌బీఐకి ఇప్పటికే సిట్ తరలించిన రూ.11 కోట్ల నోట్ల కట్టలను మార్చి వేసేందుకు అవకాశం ఉందని ఏసీబీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
కాబట్టి రూ.11 కోట్ల కట్టలను ఇతర నోట్లతో కలపకుండా, పూర్తి వీడియో ఆధారాలతోసహా భద్రపరచాలని సోమవారం వాదనలు వినిపించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఎస్‌బీఐ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి హక్కులను పరిరక్షించేందుకు, ఆయన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ నోట్ల సీరియల్ నంబర్లు సహా నోట్ చేసి, విడిగా భద్రపరచాలని స్పష్టం చేసింది. తదనుగుణంగా తదుపరి చర్యలు చేపడతామని పేర్కొంది.