ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు ఆస్కారం

Abhay Bakre says opportunity for huge investments in energy sector - Sakshi

2031 నాటికి జాతీయ స్థాయిలో  రూ.10.02 లక్షల కోట్లు లక్ష్యం

రాష్ట్రంలో 15,787 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌  పొదుపునకు అవకాశం

బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సామర్థ్య రంగంలో  భారీ  పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే తెలిపారు. అలాగే పెట్టుబడులకు ఏపీలో సానుకూల వాతావరణం కూడా ఉందన్నారు.  జాతీయ స్థాయిలో 2031 నాటికి  రూ.10.02 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెల్లడించారు.

ఏపీ ఇంధన సంరక్షణ మిషన్‌ అధికారులతో బాక్రే ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంధన రంగంలో పెట్టుబడుల వల్ల పారిశ్రామిక, రవాణా, భవన నిర్మాణం, తదితర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనివల్ల  ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన మెరుగవుతుందన్నారు. ఇంధన రంగంపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతుందని.. దీంతో పర్యావరణం కూడా మెరుగవుతుందని బాక్రే వివరించారు.  ఇంధన సామర్థ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఆయన అభినందించారు.

రోడ్‌ మ్యాప్‌ను రూపొందించాలి..
రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా  అన్ని రంగాల్లో 15,787 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను  పొదుపు చేసేందుకు అవకాశం ఉందని అజయ్‌ బాక్రే తెలిపారు. 2030 నాటికల్లా  6.68 మిలియన్‌ టన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్విలెంట్‌ (ఎంటీవోఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన రోడ్‌ మ్యాప్‌ను రూపొందించాలని ఏపీ ఇంధన సంరక్షణ మిషన్‌కు సూచించారు.  

జాతీయ స్థాయిలో 2030 నాటికి  150 ఎంటీవోఈ  ఇంధనాన్ని  పొదుపు చేయాలని  లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో  రాష్ట్రం కనబరుస్తున్న ఉత్తమ పనితీరుని చూసి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని సహాయక  ఏజెన్సీగా  నియమించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top