75 ఏళ్ల వయస్సులోనూ చదువుల దాహం | 75-Year-Old Woman Continues Her Learning Journey takes Sanskrit ‘Kovid’ Exam | Sakshi
Sakshi News home page

75 ఏళ్ల వయస్సులోనూ చదువుల దాహం

Aug 17 2026 11:18 AM | Updated on Aug 17 2026 11:36 AM

75-Year-Old Woman Continues Her Learning Journey takes Sanskrit ‘Kovid’ Exam

భర్త శివసుబ్రహ్మణ్యంతో...

తెనాలి: ఆమె వయసు 75 వసంతాలు... ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసి ఎన్నో ఏళ్లు గడిచాయి. అయిదుగురు పిల్లలు. వారి ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు అన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఇక విశ్రాంతే అనుకునే వయసులోనూ ఆమె పుస్తకాలను తన నేస్తాలుగా చేసుకున్నారు. విశ్రాంత సమయాన్ని వృథా చేయకుండా సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నారు. ‘సంస్కృత భారతి’ జ్ఞాన పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటికే మూడు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె, సంస్కృతంలోని చివరిదైన ‘కోవిద’ పరీక్షను ఆదివారం రాశారు. బాగా రాశానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆమే తెనాలికి చెందిన వంగవేటి మహాలక్ష్మి.  

ప్రభుత్వం ఉద్యోగంలో చేరి... 
దేవుడిచ్చిన జీవితంలో విశ్రాంత జీవితాన్ని యోగం, సంస్కృతం, ఆధ్యాత్మికత అనే అంశాలకు కేటాయించినట్టు చెబుతారు. ఆమె తండ్రి కామేశ్వరరావు తాలూకా హైస్కూలులో టీచరు. చదువంటే తగని ఆపేక్షతో ఉండేవారు. మహాలక్ష్మి చదివింది అదే హైస్కూలులో ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకే. 

తర్వాత హిందీకేసి చూశారు. ప్రాథమికం నుంచి విశారద వరకు చదివారు. టైపు నేర్చుకుంటే మంచిది కదా.. అనుకుని అటువైపు వెళ్లారు. టైపు రావటంతో చదివిన హైస్కూలులోనే ఉద్యోగం ఇచ్చారు. వృత్తి జీవితం చూసుకుంటూనే షార్ట్‌హ్యాండ్, తెలుగు టైపు కూడా నేర్చుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో దూరవిద్యలో సోషియాలజీ ప్రధానాంశంగా డిగ్రీ పూర్తిచేశారు. 1975లో పరిశ్రమల శాఖలో స్టెనోగా ఉద్యోగం లభించింది. గుంటూరులో పోస్టింగ్‌. రోజూ రైలులో వెళ్లి వచ్చారు. 1982లో పెనుమూడి శివసుబ్రహ్మణ్యంతో వివాహమైంది.

 ఆయన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉద్యోగి. గుంటూరులో డీఈవో, పరిశ్రమల శాఖ రెండూ ఎదురెదురుగానే ఉండేవి. మరో నాలుగేళ్లు రైలు సర్వీస్ చేశాక, గుంటూరులో కాపురం పెట్టారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అయిదుగురు మగపిల్లలు కలిగారు. వాళ్ల పెంపకం, చదువు, కుటుంబ బాధ్యతలను సక్రమంగా చూసుకున్నారు. 2003లో శివసుబ్రహ్మణ్యం, 2007లో మహాలక్ష్మి రిటైరయ్యారు. పిల్లల కోసమని కొన్నాళ్లు తమిళనాడులో వెల్లూరు దగ్గర కాటా్పడిలో, మరికొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చింది. తిరిగి సొంతూరు తెనాలిలో స్థిరపడ్డారు. ఉన్నత ఉద్యోగాల్లో తమ సంతానంలో నాలుగో కొడుకు బ్యాంక్‌ అధికారి. విజయవాడలో మల్లాది సూరిబాబు కుమారుడు శ్రీరామ్‌ప్రసాద్‌ శిష్యరికంలో సంగీతం అభ్యసించారు.  

అలా వచ్చింది ఆలోచన.. 
‘మా నాలుగో వియ్యంకుడు ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో ఇంజినీరుగా చేసి, రిటైరయ్యాక సంస్కృత పాఠాలు చెబుతున్నారు. ఇది తెలిశాక నేను కూడా విశ్రాంత జీవితాన్ని వృథాగా ఎందుకు గడపాలనే ఆలోచన చేశాను’ అంటారు మహాలక్ష్మి. గురువు రూపాకుల వేణుగోపాలదత్తు నుండి పాఠాలు తెప్పించుకుంటూ సంస్కృత అధ్యయనం ఆరంభించారు. ఆ విధంగా సంస్కృత భారతి నిర్వహించే ప్రవేశ, పరిచయ, శిక్ష పరీక్షలు పాసయ్యారు.

 చివరిదైన ‘కోవిద’ను దేవేంద్రగుప్త (గుంటూరు) అనే గురువు నుంచి నేర్చుకున్నారు. ఆదివారం తెనాలిలోని ‘శ్రీ సరస్వతీ శిశుమందిర్‌’లో జరిగిన ‘శిక్ష...పరిచయ’ పరీక్షల్లో మహాలక్ష్మి కోవిద పరీక్ష రాశారు. ఆ వయసులో అంత శ్రద్ధతో చదువుతూ పరీక్షలు రాస్తున్న మహాలక్ష్మిని తోటి విద్యార్థులు, విద్యామందిర్‌ నిర్వాహకులు అబ్బురంగా చూశారు. మరోవైపు శ్రీవిద్యను అభ్యసించారు. గురువు ధరణికోట రామదాసు. క్రియాయోగంలో నాలుగేళ్ల కోర్సు చేశారు. నిత్యం ఇంట్లోని ఒక గదిలో శ్రీచక్రంతో కొంతసేపు గడుపుతారు. 

మరో గదిలో యోగంలో కొనసాగుతారు. మిగిలిన సమయంలో కొంత పూజాదికాలకు, తర్వాత చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదని ఆమె జీవితం చాటిచెప్పింది. ఉద్యోగ విరమణ అనంతరం చాలామంది విశ్రాంతిని ఎంచుకుంటే, ఆమె మాత్రం కొత్త విషయాలను నేర్చుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. పిల్లలు జీవితంలో స్థిరపడిన తర్వాత కూడా ‘నేర్చుకోవాలనే తపనకు వయసు అడ్డంకి కాదు’ అని తన ఆచరణతో నిరూపించారు. ఈ నిరంతర అన్వేషణ నిజంగా స్ఫూర్తిదాయకం. ఆమె మాత్రం ఇందుకు తన భర్త శివసుబ్రహ్మణ్యం ప్రోత్సాహం, సహకారం కారణమని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement