కవులు, కళాకారులకు పుట్టినిల్లు తెలుగు నేల

5th World Telugu Writers Mahasabhalu concluded in Vijayawada - Sakshi

సాహిత్య యోధులు ఉన్నంత వరకు అమ్మభాషకు ఆపద వాటిల్లదు

పర్లాకిమిడి నుంచి కావేరి తీరం వరకు తెలుగు పునాదులు పటిష్టం 

అమ్మలతో మాతృభాష పరిరక్షణ సంపూర్ణం 

ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి 

విజయవాడలో ముగిసిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 

సాక్షి, అమరావతి: మహామహులైన కళాకారులు, కవులకు పుట్టినిల్లు తెలుగు నేల అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి అన్నారు. ముఖ్యంగా జాతిని జాగృతం చేసి, ప్రకృతిలో ఓలలాడించిన సాహిత్యం కృష్ణాజిల్లా కవులకే చెల్లుతుందన్నారు. విజయవాడలో రెండ్రోజులుగా జరుగుతున్న 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్‌ శేషసాయి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరికీ లేని ప్రత్యేకత తెలుగు వారికి మాత్రమే ఉందన్నారు. ‘తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలను పెంచుకుందాం’ అని సభికులకు పిలుపునిచ్చారు.

తెలుగు గడ్డపై సాహిత్య యోధులు ఉన్నంత వరకు అమ్మభాషకు ఆపద వాటిల్లదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎందరో కవులు, కళాకారులు, వాగ్గేయకారులు ఉత్తరాన పర్లాకిమిడి నుంచి దక్షిణాన కావేరి తీరం వరకు వేసిన పునాదులే తెలుగుకు రక్షా కవచాలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. అయినప్పటికీ భాష విషయంలో అలసత్వం వహించకూడదన్నారు. మరోవైపు.. తమిళులు, కన్నడిగులతో పోలిస్తే తెలుగు వారికి భాషాభిమానం తక్కువని ఆవేదన వ్యక్తంచేశారు.

అమ్మ పొత్తిళ్లలోనే జీవనం ప్రారంభమవుతుందని.. మాతృభాష పరిరక్షణలో అమ్మలే ముఖ్య భూమిక పోషించాలని కోరారు. భావితరాలకు భాషా సంస్కృతి దూరం కాకూడదన్నారు. ఉపాధ్యాయులు భాష పరిరక్షణపై విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని జస్టిస్‌ శేషసాయి సూచించారు. ప్రజలు భాషా సంస్కృతిని మర్చిపోతే.. ఆ భాష మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందన్నారు.  

రచయితలు తెలుగుజాతిని ప్రభావితం చేయాలి.. 
సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా తెలుగు పరిరక్షణపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయన్నారు. అప్పుడే తెలుగుకు సరైన ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం వచ్చేదికాదన్నారు. రచయితలు, కవులు తమ సాహిత్యంతో తెలుగుజాతిని ప్రభావితం చేయాలన్నారు. భాషా ప్రవాహం నిరంతరం పారుతూ.. నిత్య కల్యాణంగా ఉండాలన్నారు. ప్రస్తుత ఏపీ సీఎం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు.

తెలుగు పరిరక్షణలో కూడా వెనక్కి తగ్గకుండా పాలన సాగిస్తారన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం పద్యాలు, పాటలతో ఆయన అలరించారు. మరో సహజ కవి అందెశ్రీ మాట్లాడుతూ.. పాశ్చాత్య ఎంగిలి భాషను కలపనంత వరకూ తెలుగు పరిమళం, గుబాళింపు ఎన్నటికీ తగ్గదన్నారు. అనంతరం ముఖ్యఅతిథులను ఘనంగా సత్కరించారు. కేవీ సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్య రూపకం ఆకట్టుకుంది. సభాధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్‌ వ్యవహరించారు. 

18 తీర్మానాలు ఆమోదం 
ఇక రెండ్రోజుల పాటు సాగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఉత్సాహంగా సాగాయి. దేశ, విదేశాల నుంచి ప్రవాస తెలుగు రచయితలు, కవులు, సాహితీ ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ‘మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, విదేశీ, మహిళా ప్రతినిధుల సదస్సు, రాష్ట్రేతర, భాషోద్యమ ప్రతినిధుల సదస్సు, సాంస్కృతిక రంగ, చరిత్ర, వైజ్ఞానిక, విమర్శ సదస్సులతో పాటు మారుతున్న సామాజిక పరిస్థితులపై తెలుగు కవితలు, సామాజిక మార్పులు.. సాహిత్య ప్రక్రియ సదస్సులు, మహిళా ప్రతినిధుల కవిసమ్మేళనంలో సాహితీ ప్రముఖులు భాగస్వాములయ్యారు. అలాగే, మహాసభల్లో 18 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటిల్లో ముఖ్యమైనవి.. 

► మాతృభాష పరిరక్షణకు జన బాహుళ్యాన్ని అభ్యర్థించాలి 
► శతక పద్యాలు, సూక్తులను చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి 
► మాతృభాష వస్తేనే ఇతర భాషల్లో రాణిస్తారన్న యునెస్కో సూచనలను విద్యారంగం పరిగణనలోకి తీసుకోవాలి 
► సాంస్కృతిక కళలపై పిల్లలకు అభిరుచి కలిగించేలా తల్లిదండ్రులు కృషిచేయాలి 
► పాఠశాలల్లో తెలుగు భాషా చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు, సంస్కృతిపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించేలా విద్యరంగం చర్యలు చేపట్టాలి 
► జాతీయ నూతన విద్యా విధానం మేరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి 
► ఇంటర్, డిగ్రీలో ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి చేయాలి 
► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి రిజర్వేషన్లతో పాటు సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో తెలుగులో చదివితే ఐదు శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి 
► రాష్ట్రేతర తెలుగు సంస్థలకు ప్రభుత్వాలు సహకారం అందించాలి 
► ఉత్తరభారత ప్రజలు కూడా తెలుగు భాష నేర్చుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి 
► భాషోద్యమానికి ప్రతి ఒక్కరూ సైనికులుగా శ్రమించేందుకు ముందుకురావాలి 
► ఆధునిక పరికరాల వాడకంలో తెలుగును ఎక్కు­వగా వినియోగించాలని యువతకు సూచన

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయారు 
తమిళనాడులో జయలలిత అధికారంలోకి వచ్చాక ఎంజీఆర్‌కు భారతరత్న వచ్చేలా చేసింది. చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు ఎందుకు భారతరత్న ఇప్పించలేకపోయారు? కేంద్రంలో అత్యున్నత పదవులు చేపట్టిన పీవీ నరహింహారావు, వెంకయ్యనాయుడు తెలుగుకు చేయాల్సిన మేలు చేయలేదు. ఈ సభలోనైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయాలి.  
– ఎంఎస్‌ రామస్వామిరెడ్డి, హోసూరు, తమిళనాడు 

మాతృభాషను ప్రేమిద్దాం.. పర భాషను గౌరవిద్దాం 
మనం మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి. దేనిని నిర్లక్ష్యం చేయకూడదు. అబుదాబిలో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సంఘాన్ని నిర్వహిస్తున్నాం. 
– కాళ్లూరి యామిని, అబుదాబి 

ఒడిశాలో తెలుగు స్కూలుకు ఏపీ సర్కారు కృషి 
మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన తర్వాత ఒడిశాలో దాదాపు తెలుగు స్కూళ్లు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి ఏపీ, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లోనూ ఉంది. ఇటీవల ఏపీ సర్కారు ఒడిశాలో స్కూల్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. 
– ఎం.సత్యనారాయణమూర్తి, బరంపురం

తెలుగులో విదేశీయుల సందడి
మరోవైపు.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో శనివారం విదేశీయులు తెలుగులో సందడి చేశారు. ఇటలీ, ఫ్రాన్స్, పోలండ్‌కు చెందిన వ్యక్తులు తెలుగులో మాట్లాడి అదరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్భంగా పోలండ్‌కు చెందిన బుజ్జి అనే చిన్నారి ఘంటశాల వెంకటేళ్వరరావు పాడిన పద్యాలు, పాటలను పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే, ఓహో సుందరీ, ‘బొమ్మను చేసి.. ప్రాణం పోసి’ పాటలతో శ్రీకృష్ణదేవరాయలు పద్యాలను అచ్చతెలుగులో చక్కగా పాడి ఔరా అనిపించాడు. అలాగే, ఇటలీకి చెందిన యువతి మరియ కసదే మూడేళ్లుగా తెలుగు నేర్చుకుంటూ.. తెలుగులోనే పీహెచ్‌డీ చేస్తోంది.

స్పష్టమైన ఆమె ఉచ్ఛారణ అందరినీ ఆకట్టుకుంది. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలన్న తపనతో ఫ్రాన్స్‌లోని ప్రాచ్యభాష నాగరికతల జాతీయ సంస్థలో చేరి తెలుగు నేర్చుకుంది. ఆమెకు ఉర్దూ, హిందీ భాషలు వచ్చు.

శ్రీశైలం ప్రాంతంలో వీరశైవులపై పరిశోధనలు చేసింది. ఇప్పుడు దక్కనీ భాషపై హైదరాబాద్‌లో పరిశోధన చేస్తోంది. తనకు తెలుగు పత్రికలు తెలియనప్పటికీ పరిశోధనలో భాగంగా విదేశాల్లో ఉన్నప్పుడే ‘సాక్షి’ ఆర్టికల్స్‌ చదివేదాన్నని చెప్పింది. మరోవైపు.. ఫ్రాన్స్‌కు చెందిన దానియెల్‌ నేజర్స్‌ సైతం తెలుగులో అనర్గళంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top