Visakhapatnam: తీరంలో విషాదం! ముగ్గురి మృతదేహాలు లభ్యం, కొనసాగుతున్న గాలింపు

4 Youth Drowned At Vizag Beach - sakshi - Sakshi

Update:
విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మరొక మృతదేహం కోసం నేవీ హెలిక్యాప్టర్‌తో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సముద్రపు అంతర్భాగంలో రాళ్ళ మధ్య చిక్కుకునే అవకాశాలు ఉండడంతో అక్కడ కూడా గాలింపు కొనసాగించారు. నిన్న సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. 

పెదవాల్తేరు/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఆర్‌.కె.బీచ్‌లో ఘోరం జరిగింది. విశాఖలో సరదాగా గడుపుదామని వచ్చిన వారి కుటుంబాల్లో సముద్రస్నానం తీవ్ర విషాదం నింపింది. పెద్దగా వచ్చిన కెరటాలకు నలుగురు గల్లంతవగా.. ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారిలో ఓ యువతి ఉంది. రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మూడవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ..  

►నూతన సంవత్సర వేడుకులు జరుపుకునేందుకు హైదరాబాద్‌ బేగంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి శివకుమార్‌ (24), డిగ్రీ విద్యార్థులు కోట శివ (20), ఎండీ అజిష్‌ (20) సహా ఎనిమిది మంది స్నేహితులు గత నెల 30న విశాఖ వచ్చారు. వీరు ఆదివారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్‌.కె.బీచ్‌లో స్నానాలకు దిగారు. ఇంతలో పెద్ద కెరటం రావడంతో బ్యాంక్‌ ఉద్యోగి శివ కుమార్, శివ, అజిష్‌ గల్లంతయ్యారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. కొంతసేపటికి శివకుమార్‌ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కోట శివ, అజిష్‌ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు కోస్టుగార్డు, నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్‌ మృతదేహం వద్ద సహచరులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

►ఒడిశాలోని కటక్‌కు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు ఆదివారం మధ్యాహ్నం ఆర్‌.కె.బీచ్‌లోని పాండురంగాపురం వద్ద స్నానాలకు దిగారు. వీరిలో సుమిత్ర త్రిపాఠి (21) సముద్రంలో కొట్టుకుపోవడంతో కమ్యూనిటీ గార్డులు రక్షించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సంఘటన స్థలానికి ఈస్ట్‌ ఏసీపీ హర్షిత చంద్ర, త్రీటౌన్‌ సీఐ కోరాడ రామారావు చేరుకుని.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీఐ రామారావు పర్యవేక్షణలో ఎస్‌ఐ హరీష్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top