ఏపీ ఈఏపీసెట్‌కు 3.62 లక్షల దరఖాస్తులు | 3.62 lakh applications for AP EAPCET | Sakshi
Sakshi News home page

ఏపీ ఈఏపీసెట్‌కు 3.62 లక్షల దరఖాస్తులు

May 17 2025 5:35 AM | Updated on May 17 2025 5:35 AM

3.62 lakh applications for AP EAPCET

19 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు

ఏపీలో 145, తెలంగాణలో రెండు సెంటర్లు

ఆన్‌లైన్‌లో రోజూ రెండు సెషన్లలో పరీక్షలు

సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2025కు 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నారని సెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ చెప్పారు. కాకినాడలోని జేఎన్‌టీయూలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,80,597, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 145, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఒక్కోటి చొప్పున ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష కేటాయించిన తేదీన వేరే జాతీయ స్థాయి పరీక్ష ఉంటే ఆధారాలతో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను సంప్రదించాలని, ఆ వివరాలను పరిశీలించి, పరీక్ష తేదీ మారుస్తామని చెప్పారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు కర్నూలు రీజినల్‌ సెంటర్‌లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. దివ్యాంగులకు సహాయకులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తులో ఏమైనా తప్పులు నమోదు చేస్తే పరీక్ష రాసిన తర్వాత హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ద్వారా మార్చుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా అనుమతిస్తామన్నారు.

అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్‌పాయింట్‌ పెన్ను మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. బయోమెట్రిక్‌కు ఆటంకం లేకుండా చేతులపై మెహందీ వంటివి పెట్టుకోవద్దని, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతిలేదని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై పరీక్ష కేంద్రం రూట్‌ మ్యాప్‌ ఉంటుందని, ముందు రోజే వెళ్లి చూసుకోవాలన్నారు. హాల్‌టికెట్లను ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌ నుంచి, మన మిత్ర వాట్సాప్‌ యాప్‌(నంబర్‌ 9552300009) ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించాలని ప్రొఫెసర్‌ ప్రసాద్‌ సూచించారు. ఈ సమావేశంలో సెట్‌ కన్వీనర్‌ వీవీ సుబ్బారావు, రెక్టార్‌ కేవీ రమణ, ఓఎస్‌డీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ చొరవతో ప్రైవేట్‌ వర్సిటీల్లో సీట్లు..
పేదింటి బిడ్డలు ప్రైవేట్‌ యూనివర్సిటీల్లోనూ ఉచితంగా చదువుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఈఏపీసెట్‌లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఏడాదికి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల ఫీజులు ఉండే ప్రైవేట్‌ వర్సిటీల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రైవేటు కళాశాలల్లోనే కాకుండా ప్రైవేటు వర్సిటీల్లోనూ అమలు చేశారు.

విట్, ఏపీ ఎస్‌ఆర్‌ఎం, ఎంబీయూ, సెంచూరియన్‌ వంటి ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందేలా చేశారు. మరోవైపు పేద పిల్లలకు మేలు చేసే గత ప్రభుత్వ విధానాలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. విచ్చలవిడిగా ఇంజినీరింగ్‌ కళాశాలలను డీమ్డ్‌ వర్సిటీలుగా మార్చుకునేందుకు అనుమతులు ఇవ్వడంతోపాటు ప్రైవేటు వర్సిటీలుగా మార్చుకునేందుకు తోడ్పాటును అందించింది. తద్వారా విలువైన కన్వీనర్‌ కోటా సీట్లను కోల్పోవాల్సి వస్తోంది.

సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే..
విభజన చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగియడంతో 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్‌ రిజర్వుడు కోటాలో తెలంగాణ విద్యార్థులకు కేటాయించే 15 శాతం సీట్లను కూడా ఏపీ విద్యార్థులకు ఇస్తారు. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం 1.81లక్షల ఇంజినీరింగ్‌ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. ఇందులో రాష్ట్ర యూనివర్సిటీ క్యాంపస్‌లు 245 , ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 1,71,079 సీట్లు, ఆర్జీయూకేటీ, డీమ్డ్, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 10,653 సీట్లు ఉన్నాయి.

మౌలిక వసతుల ఆధారంగా కళాశాలలు సొంతంగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు ఏఐసీటీఈ కల్పించింది. దీంతో ఈ ఏడాది ఇంజనీరింగ్‌ సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా కళాశాలలు సంప్రదాయ ఇంజినీరింగ్‌ కోర్సులను పక్కనపెట్టి విద్యార్థులను ఆకర్షించేందుకు కంప్యూటర్‌ ఆధారిత కోర్సులకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. 2024–25లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులోనే ఏకంగా 99,494 సీట్లు ఉండటం గమనార్హం. కాగా కన్వీనర్‌ కోటాలో 1.36లక్షల సీట్లు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement