
ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న పేదలకు సాయం నిలిపివేత
మిత్రాలు అప్‌లోడ్ చేస్తున్న దరఖాస్తులు పెండింగ్
గతేడాది జూన్ నుంచి పేదలకు రూ.203 కోట్ల బకాయిలు
ఆరోగ్యశ్రీలో చికిత్సానంతరం జీవన భృతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 24 గంటల్లోనే నగదు జమ
టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఆసరాకు మంగళం
ఆరోగ్యశ్రీ కింద కూడా పేరుకుపోయిన రూ.3,500 కోట్ల బకాయిలు
సాక్షి, అమరావతి: పీ4తో పేదరికాన్ని నిర్మూలిస్తానని చెబుతున్న సీఎం చంద్రబాబు.. పాలనలో మాత్రం అడుగడుగునా పెత్తందారీ పోకడలతో పేదలను వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తా.. సంక్షేమం అమలుచేస్తాననే కల్లబొల్లి కబుర్లతో గద్దెనెక్కి ఇప్పుడు పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏడాది కూడా తిరగకుండానే అనారోగ్యంతో చికిత్సలు పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు విశ్రాంత సమయంలో అందించే ఆసరా సాయాన్ని అటకెక్కించారు.
ఇందులో భాగంగా గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 4 లక్షల మందికి పైగా బాధితులకు రూ.203 కోట్ల మేర ఆసరా సాయం ఎగ్గొట్టేశారు. ఇదేకాక.. ఆరోగ్యశ్రీ కింద రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా.. ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు నగదు రహిత వైద్యసేవలు అందించడంలేదు.
వాస్తవానికి.. పేదలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసి, చికిత్సానంతరం బాధితులకు అండగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో జీవన భృతి మొత్తాన్ని రోగి/కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

రూ.203 కోట్లు బకాయిపడ్డ బాబు సర్కారు
కానీ, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకోగానే ఆరోగ్యశ్రీని బీమా రూపంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య ఆసరాకు పూర్తిగా మంగళం పాడేశారు. దీంతో.. గతేడాది జూన్ నుంచి ఆసరా చెల్లింపులను ప్రభుత్వం నిలిపివేసింది. రోగులు ఆసరా సాయం కోసం చేసుకున్న దరఖాస్తులను ఆరోగ్యవిుత్రలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సాయం విడుదల చేయడంలేదు.
ఇలా గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 4 లక్షల మందికి పైగా బాధితులకు రూ.203 కోట్లు చెల్లించలేదు. కానీ, గత ప్రభుత్వం మాత్రం ఆలస్యం లేకుండా రోగుల ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి ఆరోగ్య ఆసరాను గ్రీన్ ఛానల్‌లో ఉంచింది.
2025–26 బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు
ఇదిలా ఉంటే.. ఆసరాకు చరమగీతం పాడేసి 2025–26 ఆర్థిక సంవత్సరానికి చంద్రబాబు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించలేదు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆసరా కోసం కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. తద్వారా ఆసరాను అమలుచేయబోమని బాబు సర్కారు తేల్చేసింది. మరోవైపు.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలును గాలికి వదిలేసింది. దీంతో.. ఇటీవల ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి.
చర్చల పేరిట ప్రభుత్వ పెద్దలు యాజమాన్యాలను పిలిచి వారితో బెదిరింపు ధోరణిలో వ్యవహరించి సమ్మె విరమింపజేయించారు. రూ.3,500 కోట్ల బకాయిలు ఉండడంతో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు నగదు రహిత వైద్యసేవలకు విముఖత వ్యక్తంచేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పేరెత్తగానే రోగులను బయటకు వెళ్లగొడుతుండగా, మరికొందరు అదనంగా డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్న దుస్థితి నెలకొంది.
జగన్ పాలనలో ఇలా..
నిజానికి.. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 1,059 ప్రొసీజర్లను 3,257కు పెంచింది. అంతేకాక.. వైద్యసేవల పరిమితిని దేశంలో ఎక్కడా లేనట్లుగా రూ.25 లక్షలకు పెంచారు. పైగా.. బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా అండగా నిలిచింది. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోజే వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లించింది.