పుష్కలంగా ఆహార ధాన్యాలు | Sakshi
Sakshi News home page

పుష్కలంగా ఆహార ధాన్యాలు

Published Thu, Mar 16 2023 4:39 AM

1,66,390 crore annual agricultural credit plan - Sakshi

సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైంది. సాగువిస్తీర్ణం స్వల్పంగా తగ్గిన­ప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైనట్లు 2022–23 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ధాన్యం ఉత్పత్తిలో కూడా 9.8 శాతం వృద్ధి నమోదైంది.

గత ఆర్థిక ఏడాది ఖరీఫ్, రబీలో కలిపి 121.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2022–23 ఆర్థిక ఏడాదిలో 133.65 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని తొలి ముందస్తు అంచనాల్లో సర్వే పేర్కొంది. డిసెంబర్‌ ఆఖరు వరకు రాష్ట్రంలో 109.33 లక్షల మెట్రిక్‌ టన్నుల పాలు, 7,34,157 మెట్రిక్‌ టన్నుల మాంసం, 1784.01 లక్షల గుడ్లు ఉత్పత్తి జరిగినట్లు సర్వే పేర్కొంది.

2021–22లో రాష్ట్రం 2645.03 లక్షల గుడ్ల ఉత్పత్తితో అగ్రస్థానంలో, 1025.59 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తితో రెండో స్థానంలో, 154.03 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తితో ఐదో స్థానంలో నిలిచిందని సర్వే స్పష్టం చేసింది. 2021–22లో రాష్ట్రంలో 48.13 లక్షల మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి జరిగితే, 2022–23 ఆర్థిక ఏడాది డిసెంబర్‌ వరకు 37.18 లక్షల మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని చెప్పింది.

2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,66,390 కోట్లు వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. ఇది గత ఆర్థిక ఏడాదితో పోల్చితే పది శాతం అదనం అని తెలిపింది. 2023–24లో రూ.1,395.45 కోట్ల వ్యయంతో కొత్తగా 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని మైక్రో ఇరిగేషన్‌ కిందకు తీసుకురా­నున్నట్లు తెలిపింది. ఇందులో రూ.1,171.81 కోట్లు సబ్సిడీగా ఉంటుందని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement