మార్కెట్‌కు 1,656 టన్నుల టమాట రాక 

1656 Tonnes Of Tomato Arrived In Madanapalle Market - Sakshi

రోజురోజుకీ పెరుగుతున్న దిగుబడులు 

తగ్గుముఖం పడుతున్న ధరలు 

రానున్న రోజుల్లో 2,000 టన్నులకు పైనే రావచ్చన్న అధికారులు 

మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్‌కు రైతులు రికార్డుస్థాయిలో టమాటను తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సీజన్‌లో అత్యధికంగా బుధవారం 1,656 మెట్రిక్‌టన్నుల టమాటను తీసుకువచ్చారు. జూన్‌ 1న మార్కెట్‌కు 342 మెట్రిక్‌టన్నుల టమాట వస్తే కేవలం 28రోజుల వ్యవధిలో ఐదురెట్లు రెట్టింపు సంఖ్యలో దిగుబడులు రావడం విశేషం.

గత రెండేళ్లలో టమాట ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, దిగుబడులు అధికంగా వచ్చినా సరుకుకు డిమాండ్‌ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పెట్టుబడులు, నారు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కూలీల సమస్య అధికంగా ఉండటంతో ఈ సీజన్‌కు రైతులు పంటసాగుకు వెనుకంజ వేశారు. అయితే ఊహించనిరీతిలో మార్చి, ఏప్రిల్‌లో టమాటకు అధిక ధరలు పలకడంతో గంపెడాశతో అప్పులు చేసి సాగుకు పూనుకున్నారు. వాతావరణం అనుకూలించడం, కొత్త వంగడాలతో అధిక దిగుబడులు రావడంతో ఒక్కసారిగా మార్కెట్‌కు టమాటలు పోటెత్తాయి.

మదనపల్లె మార్కెట్‌ నుంచి టమాట ఎగుమతులు జరిగే మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో స్థానికంగా టమాట సాగుచేయడంతో బయటి వ్యాపారులు ఎవరూ రాలేదు. దీంతో ధరలు నెలరోజులతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతానికి లభిస్తున్న ధరలు రైతులకు ఆశాజనకంగానే ఉన్నాయి. మదనపల్లె మార్కెట్‌కు అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా, అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, కర్నాటక శ్రీనివాసపురం, చింతామణి, వడ్డిపల్లె, కోలారు తదితర ప్రాంతాల నుంచి రైతులు టమాటను తీసుకువస్తున్నారు.

ఇక్కడి నుంచి తెలంగాణ, పాండిచ్చేరి, మహరాష్ట్ర బీజాపూర్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు, విశాఖపట్నం, కాకినాడ నగరాలకు టమాట ఎగుమతులు జరుగుతున్నాయి. బుధవారం మదనపల్లె మార్కెట్‌లో మొదటిరకం టమాట కిలో రూ.12–16, రెండోరకం టమాట కిలో రూ.7–11.60 మధ్య ధరలు నమోదయ్యాయి.  దిగుబడులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ తట్టి శారదమ్మ, కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top