
సీజన్ ప్రారంభంలో రూ.1,300 పలికిన 25 కిలోల బాక్స్ ధర
నేడు రూ.150 కంటే తక్కువకు పడిపోయిన వైనం
తీవ్ర ఆవేదనతో టమాటా పంటను రోడ్లపై పారబోస్తున్న రైతులు
ప్యాపిలి, పత్తికొండ: వరి.. మిర్చి.. పత్తి.. ఉల్లి.. చీని.. అరటి.. మినుము.. ఉల్లి.. వేరుశనగ.. ఇప్పుడు టమాటా! రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతుండగా తాజాగా టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. నిన్నటిదాకా కిలో రూ.50 దాకా పలికిన టమాటా ఇప్పుడు రూ.ఐదుకూ కొనే నాథుడు లేక రైతన్నలు అల్లాడుతున్నారు. కర్నూలు జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
నంద్యాల జిల్లా ప్యాపిలిలో సీజను ప్రారంభంలో 25 కిలోల బాక్స్ రూ.1,300 పలకగా ఇప్పుడు ధర అమాంతం పతనమైంది. నాణ్యత సాకుతో వ్యాపారులు రూ.150 కంటే తక్కువకు అడుగుతున్నట్లు వెంగళాంపల్లి రైతు వేల్పుల సుధాకర్ వాపోయాడు. దీంతో శుక్రవారం మార్కెట్‌లో టమాట పారబోసి నిరసన వ్యక్తం చేశాడు. ఓ వైపు కారుచౌకగా అడుగుతున్న వ్యాపారులు వేలం ముగిశాక రూ.50 మినహాయించుకుంటున్నారని, కనీసం రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని కన్నీరు మున్నీరయ్యాడు.
ప్యాపిలి మార్కెట్‌కు భారీగా టమాట వస్తోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోనూ టమాటా మార్కెట్ ప్రారంభమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. హైదరాబాద్ మార్కెట్‌కు మూడు రోజులు పాటు సెలవు కావడంతో సరుకంతా దెబ్బ తింది. దీంతో వ్యాపారులు ధరలు తగ్గించేశారు.
శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌కు రైతులు తెచ్చిన టమాట 20 కేజీల జత గంపలు రూ.100 నుంచి రూ.200 మాత్రమే పలకడంతో హతాశులయ్యారు. గత నెల రోజులు పాటు జత గంపలు రూ.1,500 నుంచి రూ.2 వేల దాకా పలకగా ప్రస్తుతం ధరలు దారుణంగా పతనమయ్యాయి. రాష్ట్రంలో మదనపల్లె తరువాత టమాట విక్రయాల్లో పత్తికొండ మార్కెట్ రెండో స్థానంలో ఉంది.