1,458 ‘సీనియర్‌ రెసిడెంట్‌’ల నియామకానికి నోటిఫికేషన్‌ 

1458 DME notification issued in govt medical dental teaching institutions - Sakshi

19 వరకు దరఖాస్తులకు గడువు

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన 45 ఏళ్లలోపు వారు అర్హులు  

పీజీ తుది పరీక్షల్లో వచ్చిన మార్కులే ప్రామాణికంగా ఎంపిక 

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తింపు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్‌ రెసిడెంట్‌ (ఎస్‌ఆర్‌) డాక్టర్‌ల నియామకానికి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 45 ఏళ్ల లోపు వయసుండి, ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. http://dme.ap.nic.in వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి.

ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్‌ఆర్‌లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్‌ రెసిడెంట్‌(పీజీ)కు రూ.65 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన (థియరీ, ప్రాక్టికల్స్‌)మార్కుల్లో మెరిట్‌ ప్రామాణికంగా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎంపికలు చేపడతారు.

అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్‌ మెడిసిన్‌లో 101, జనరల్‌ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్‌ఆర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా  ప్రభుత్వం 46 వేల పోస్టులను భర్తీ చేపట్టింది. 
 
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే.. 
ఎస్‌ఆర్‌ పోస్టుల నియామకంలో తమకు అవకాశం కల్పించాలని కొందరు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో పీజీ చేసిన వైద్యులు సంప్రదిస్తున్నారు. అయితే నేషన్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) అడ్మిషన్‌ నిబంధనల మేరకు కళాశాలల్లోని ప్రతి విభాగంలో ఎస్‌ఆర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఈ క్రమంలో కేవలం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే అవకాశం కల్పిస్తున్నాం. ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో చదివిన వారు తాము చదివిన కళాశాలల్లో ఎస్‌ఆర్‌లుగా పనిచేసేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలను సంప్రదించాలి. 
– డాక్టర్‌ వినోద్‌కుమార్, డీఎంఈ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top