నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహర్నవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పరిష్కార వేదిక రద్దు చేసినట్లు తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

నగరపాలక సంస్థలో

ఎంసీఎంసీ ఏర్పాటు

అనంతపురం అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీడియా ధ్రువీకరణ, పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌ తెలిపారు. ఈ కమిటీ పెయిడ్‌ న్యూస్‌ను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ పన్నుల విభాగం (గది 12)లో ఏర్పాటైన ఎంసీఎంసీ తన కార్యకలాపాలను సాగిస్తుందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కమిటీ ఇదే..

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎంసీఎంసీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా నగర పాలక సంస్థ కమిషనర్‌, సమాచార శాఖ అధికారి ఉంటారు.

పెయిడ్‌ న్యూస్‌ గుర్తింపు ఇలా..

మునిసిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి టీవీ ఛానళ్లు, కేబుల్‌ నెట్‌వర్క్‌, రేడియో, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో విజువల్‌ డిస్‌ప్లేలు, ఈ– పేపర్లు, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లు, సోషల్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలను కమిటీ పరిశీలించి ‘పెయిడ్‌ న్యూస్‌’గా ధ్రువీకరిస్తుంది.

అనుమతి తీసుకోవాలి..

గుర్తింపు పొందిన లేదా నమోదైన రాజకీయ పార్టీ లేదా వ్యక్తిగత అభ్యర్థి ద్వారా ఏదైనా రాజకీయ ప్రకటన ధ్రువీకరణకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ప్రసారం, ప్రదర్శన ప్రారంభమయ్యే తేదీకి కనీసం ముందు రోజు కమిటీ అనుమతి తీసుకోవాలి.

అనెగ్జర్‌–ఏలో దరఖాస్తు..

దరఖాస్తు అనెగ్జర్‌–ఏలో సూచించిన ఫార్మాట్‌లో ఉండాలి. ప్రతిపాదిత ప్రకటనకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రూపంలో రెండు కాపీలు, దానితో పాటు సక్రమంగా ధ్రువీకరించిన ప్రతిలేఖనం (ట్రాన్స్‌క్రిప్షన్‌), తదితర వివరాలతో సమర్పించాలి.

నామినేషన్‌ ప్రక్రియ పరిశీలన

అనంతపురం అర్బన్‌: నగర పాలక సంస్థలో నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుడు బి.స్మరణ్‌రాజ్‌, ఎన్నికల వ్యయ పరిశీలకుడు జి.సుబ్బరాజ్‌ ఆదివారం పరిశీలించారు. అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రోజువారీగా ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌రావు, ఆర్డీఓ ప్రేమంత్‌కుమార్‌, టీపీఓ ఓంకార్‌, మాస్టర్‌ ట్రైనర్‌ గోవిందరాజులు, ఆర్‌ఓలు ఉన్నారు.

అక్కడక్కడా వర్షాలు

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 14 మండలాల పరిధిలో 6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 41 మి.మీ, యాడికి 40.4, పుట్లూరు 23.4, బ్రహ్మసముద్రం 22.4, తాడిపత్రి 20.4, గుత్తి 15.6 మి.మీతో పాటు శెట్టూరు, పామిడి, బెలుగుప్ప, గుంతకల్లు, యల్లనూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం, రాప్తాడు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాగల రెండు రోజుల వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement