రాప్తాడు రూరల్: రాప్తాడుకు చెందిన ఈశ్వరయ్య, హారిక దంపతులు జాతీయ రహదారి కూడలిలో బెల్లం టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె యశస్విని, కుమారుడు ప్రణవ్ తేజ (4) సంతానం. హారిక పుట్టిల్లు పుల్లలరేవు. ప్రణవ్తేజను అమ్మమ్మ శివలక్ష్మి, తాత బిల్లే ముత్యాలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో హారిక శనివారం సాయంత్రం పుట్టింటికి వెళ్లింది. ఆదివారం ఉదయం దసరా పండుగ కోసం కుమారుడిని వెంటబెట్టుకుని రాప్తాడులోని అత్తవారింటికి బయల్దేరింది. ఆ సమయంలో ఆమె సోదరుడు ప్రేమ్నాథ్ కూడా తోడుగా వెళ్లాడు. అక్కడ ప్రణవ్ తేజ కాసేపు అమ్మానాన్నతోపాటు నానమ్మ, తాతతో సరదాగా గడిపాడు. ఆతర్వాత తిరిగి వెళ్తున్న మామయ్య ప్రేమ్నాథ్ వెంట తానూ వెళ్తానని ప్రణవ్తేజ పట్టుబట్టాడు. వద్దని తల్లి వారించినా వినకపోవడంతో చేసేదేమీలేక అమ్మమ్మ ఊరైన పుల్లలరేవుకు పంపించారు. అక్కడ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆడుకునేందుకు ఇంటి సమీపంలోని కల్లందొడ్డి వద్దకు వెళ్లాడు. అక్కడ వరికోతకు వినియోగించే ట్రాక్టర్ చక్రాలకు అదనంగా అమర్చే ఇనుప చక్రాన్ని (గేజ్ వీల్) శుభ్రం చేసి ఓవైపు నిలిపి ఉంచారు. అక్కడికి వెళ్లిన చిన్నారి..ఆ చక్రం వద్ద ఆడుకుంటుండగా అది కదిలి అదుపుతప్పి మీద పడింది. ఛాతిపై చక్రం పడినప్పుడు సమీపంలో ఎవరూలేరు. గేజ్వీల్ కింద పడిన ప్రణవ్తేజ ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన కాసేపటి తర్వాత అటుగా వెళ్లిన వారు ఈ ఘటనను గుర్తించారు. ఇనుప చక్రం కింద ఉన్న చిన్నారిని బయటకు తీశారు. అయితే, అప్పటికే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాసేపటి క్రితం వరకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి..విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఉదయం తల్లి వెంట రాప్తాడుకు వెళ్లిన చిన్నారి అక్కడే ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమోనని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. తమ ఇంటి ఆశాదీపం, తమ కళ్ల ముందే ఎదగాల్సిన కుమారుడు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దేవుడా.. ఎంత పనిచేశావయ్యా అంటూ తల్లిదండ్రులు పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్నవారిని కలచివేశాయి. పండుగ వేళ చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో పుల్లలరేవులో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆడుకుంటూ వెళ్లి అనంత లోకాలకు..
ఇనుప చక్రం కింద పడి
ప్రాణాలొదిలిన చిన్నారి
పుల్లలరేవులో పండుగపూట
విషాద ఘటన


