చైర్మన్‌ టికెట్‌ కేటాయింపులో మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ టికెట్‌ కేటాయింపులో మొండిచేయి

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

● మనస్తాపంతో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్‌ రాజీనామా

గుంతకల్లు: మున్సిపల్‌ చైర్మన్‌ టికెట్‌ కేటాయింపులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముక్కన్నగారి గుణశేఖర్‌కు భంగపాటు ఎదురైంది. మరొకరికి టికెట్‌ కేటాయించడంతో మనస్తాపం చెందిన ఆయన ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి తన తండ్రి ముక్కన్న పార్టీకి సేవలందించారన్నారు. జిల్లా అధ్యక్షుడిగా, గుంతకల్లు మున్సిపల్‌ చైర్మన్‌గా 1996–97లో కొనసాగినట్లు వివరించారు. ఆ తర్వాత తన అన్న రామాంజినేయులు కూడా పట్టణ అధ్యక్షుడిగా సేవలందించారని గుర్తు చేశారు. తాను క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌గా, కౌన్సిలర్‌గా, ప్రసుత్తం పట్టణ అధ్యక్షుడిగా సేవలందించానని చెప్పారు. మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో.. తన మరదలు బోయ రాజేశ్వరికి టికెట్‌ కేటాయించాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ద్వారా అధిష్టానానికి నివేదించామన్నారు. తమకు సీటు కన్ఫర్మ్‌ అయినట్లు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా తెలిపారని, తీరా చూస్తే ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ కోడలు యశోద పేరు అధికారికంగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందుకే తన మరదలను రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. తన తండ్రి ముక్కన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలు పెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తామని చెప్పారు.

కోడ్‌ ఉల్లంఘించి..

నామినేషన్‌ కేంద్రంలోకి

కళ్యాణదుర్గం: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన ఆదివారం టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం చూపారు. నామినేషన్‌ కేంద్రం వద్ద అధికార బలంతో బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ స్థానాలకు ఆశావహులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ క్రమంలో నామినేషన్‌ కేంద్రం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రాగానే ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా కేంద్రం వైపు దూసుకొచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన పార్టీ శ్రేణులు హద్దులు దాటి వచ్చారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ నామినేషన్‌ కేంద్రం సమీపంలోకి డీజే వాహనాలను, ఇతర వాహనాలను అనుమతించడం పలు విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement