ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పక్కదారి పట్టిందా..? మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి చక్కర్లు కొడుతున్న రెండు జాబితాల్లో ఏదీ నిజమైనదో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ద్వారా గెజిట్ అయిన జాబితా కంటే ముందుగానే మరో జాబితా బయటకు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు ఆశించిన విధంగా రిజర్వేషన్లు తమకు అనుకూలంగా లేకపోవడంతో ఈవిధమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి. కొంతమంది పచ్చ మాస్కు వేసుకున్న అధికారుల అత్యుత్సాహం కూడా ఆ నేతలకు అనుకూలంగా మారింది.
ఎంపీటీసీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసే నిబంధనావళి పలుమార్లు మారింది. దీంతో పలు మండలాల్లో ఎంపీటీసీ రిజర్వేషన్ల జాబితా తీవ్ర గందరగోళంగా మారింది. మొదట్లో రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగించాలని చెప్పడంతో మండల స్థాయి అధికారులు జాబితాలను తయారు చేశారు. దీనిపై సంబంధిత ఆర్డీఓలు సంతకాలు కూడా చేశారు. కొన్ని గంటలు గడకవక ముందే రిజర్వేషన్ ప్రక్రియ రొటేషన్ పద్ధతిపై కాకుండా మొదటి నుంచి ప్రారంభించారు. ఇక్కడే జాబితాల తారుమారు వ్యవహారానికి తెర తీశారు. ముఖ్యంగా కూడేరు, రాప్తాడు తదితర మండలాల్లో ఎంపీటీసీల రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ జాబితాకు సంబంధం లేకుండా మరో జాబితా వాట్సప్‌లలో చక్కర్లు కొట్టింది.
కూడేరు మండలం చోళసముద్రం, కొర్రకోడు ఎంపీటీసీ స్థానాల విషయంలో విభిన్నమైన రిజర్వేషన్లు వెలుగుచూశాయి. మొదటి గెజిట్ జాబితాలో చోళసముద్రం అన్రిజ్వరుడ్ మహిళకు కేటాయించగా, కొర్రకోడు స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. రెండు రోజుల తరువాత అధికారులు విడుదల చేసిన మరో జాబితాలో చోళసముద్రం ఎస్సీ మహిళకు, కొర్రకోడు స్థానం అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. దీనిపై తీవ్ర గందరగోళం నెలకొంది. జిల్లాలో మహిళా రిజర్వేషన్ల స్థానాలు తక్కువ కావడం వల్ల ఇలా పలుమార్లు తమ జాబితాలు మారాయని కొందరు అధికారులు వెల్లడించడం గమనార్హం.
వాట్సప్‌లలో చక్కర్లు కొడుతున్న
ఎంపీటీసీ రిజర్వేషన్ల జాబితా
కూటమి నేతల కుట్రలంటూ ఆరోపణలు
అలాంటిదేంలేదంటున్న అధికారులు
గెజిట్ జాబితానే సరైనది
కూడేరు మండలం ఎంపీటీసీ రిజరేషన్లకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ద్వారా గెజిట్ అయిన జాబితానే సరైంది. దీని ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ విషయంలో అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– సాజిదా బేగం, కూడేరు రిటర్నింగ్ అధికారి
జాబితా తారుమారు..
గందరగోళంగా
ఎంపీటీసీ రిజర్వేషన్ల జాబితా


