అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామాల్లో రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్ గురువారం సాయంత్రం రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని 576 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు, 5,820 వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లపై స్పష్టత వచ్చింది.
మారనున్న సమీకరణాలు
గ్రామాల్లో సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న నాయకులకు రిజర్వేషన్ల ప్రకటన కీలకంగా మారింది. తమ సామాజిక వర్గానికి అవకాశం దక్కిన గ్రామాల్లో పోటీకి సిద్ధమవుతున్న నేతలు.. రిజర్వేషన్ అనుకూలించని చోట ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో బలాబలాలు, సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ప్రధాన పార్టీల నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
గ్రామాల్లో ఎన్నికల సందడి
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ పెరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండో విడత నవంబర్ 29న, మూడో విడత డిసెంబర్ 2న జరగనుంది. గెజిట్ విడుదలతో రిజర్వేషన్లపై నెలకొన్న అనిశ్చితి తొలగినా, గ్రామాల్లో అసలు రాజకీయ పోరు ఇప్పుడే మొదలుకానుంది. సర్పంచ్ పదవితో పాటు వార్డు స్థానాలు దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు.
వార్డు స్థానాల్లోనూ స్పష్టత
గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లపైనా స్పష్టత వచ్చింది. జిల్లాలోని 5,820 వార్డుల్లో ఎస్టీలకు 240, ఎస్సీలకు 990, బీసీలకు 1,662, జనరల్ కేటగిరీలో 2,928 స్థానాలను కేటాయించారు. వీటిలో మహిళలకు 2,902, జనరల్ కేటగిరీలో 2,918 స్థానాలు ఉన్నాయి.
సర్పంచ్ స్థానాల్లో ఎవరెక్కడ?
జిల్లాలోని మొత్తం 576 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 18, ఎస్సీలకు 97, బీసీలకు 165, జనరల్ కేటగిరీలో 296 సర్పంచ్ స్థానాలను కేటాయించారు. మహిళలకు 287, జనరల్ కేటగిరీలో 289 స్థానాలు దక్కాయి.
576 పంచాయతీలు, 5,820 వార్డులకు రిజర్వేషన్ల ఖరారు
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్
పంచాయతీలకు సంబంధించి ఎస్టీలకు 18, ఎస్సీలకు 97, బీసీలకు 165, జనరల్కు 296
వార్డుల్లో ఎస్టీలకు 240, ఎస్సీలకు 990, బీసీలకు 1.662, జనరల్కు 2,928 స్థానాలు


