అనంతపురం క్రైం: కార్పొరేషన్ ఎన్నికల వేళ కూటమిలో అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులు, అనిశ్చితి ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక, డివిజన్ల వారీ వ్యూహాలతో ఎన్నికల బరిలో ముందుకు దూసుకెళ్తోంది. ఒకవైపు దిశానిర్దేశం కోసం కూటమి పార్టీల నేతలు ఎదురుచూస్తుంటే... వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
కార్యాచరణలో వెనకడుగు
నగరపాలక సంస్థ ఎన్నికల్లో డివిజన్ల వారీగా అభ్యర్థులు ఎవరన్నది కూటమిలో ఇప్పటికీ స్పష్టత రాకపోవడం నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠకు కారణమవుతోంది. కీలకమైన ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించి శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సి ఉండగా.. నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా ఏ దిశలో ముందుకెళ్లాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారు, ఏ డివిజనన్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ లేకుండాపోయింది. నాయకత్వం నుంచి భరోసా లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లతో అసంతృప్తి సెగలు
డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో పలువురు ఆశావహుల రాజకీయ లెక్కలు తారుమారయ్యాయి. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసినవారు, ఈసారి పోటీకి సిద్ధమైన నేతలు తమకు అనుకూలమైన డివిజన్లలో అవకాశాలు లేకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. పునర్విభజన సమయంలో ముందస్తు వ్యూహం లోపించిందని, సామాజిక సమీకరణలు, స్థానిక బలాబలాలను సరిగా అంచనా వేయలేకపోయామని కొందరు కూటమి నేతలు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అసంతృప్తులను బుజ్జగించి, ప్రత్యామ్నాయ అవకాశాలపై భరోసా కల్పించాల్సిన నాయకత్వం నుంచి చొరవ కనిపించడం లేదన్న భావన వారిలో మరింత నిరుత్సాహాన్ని పెంచుతోందంటున్నారు. ఈ అసంతృప్తి ఎన్నికల వేళ రెబల్ అభ్యర్థుల రూపంలో బయటపడితే కూటమి ఓట్ల సమీకరణపై ప్రభావం పడటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వైఎస్సార్సీపీలో ఉత్సాహం
స్థానిక ఎన్నికల సన్నద్ధతలో వైఎస్సార్సీపీ ముందంజలో ఉందనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 62 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చిందని, మేయర్ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం మాజీ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ డివిజన్ల వారీగా బలాబలాలను అంచనా వేస్తున్నారు. స్థానికంగా పట్టున్న నాయకులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, కార్యకర్తల నెట్వర్క్ను సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ వేగం కూటమి నేతల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల వేళ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్కు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చినట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక పగ్గాలు ఎమ్మెల్యే చేతుల నుంచి పార్టీ నాయకత్వం నియమించిన కమిటీల పరిధిలోకి వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి తరఫున కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక కోసం సుమారు 20 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. టీడీపీలోనూ ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో కమిటీని రంగంలోకి దించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, అనంతపురం పార్లమెంటు ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్రెడ్డి, టౌన్ భ్యాంకు అధ్యక్షుడు జేఎల్ మురళి, గంపన్న, షకిల్ షఫీ, మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు గౌస్ తదితర నేతల సారథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు సాగుతున్నట్లు తెలిసింది.
నాకు చెప్పకుండా ఎలా చేస్తారు?
అభ్యర్థుల ఎంపికపై తనకు సమాచారం ఇవ్వకుండా కమిటీలు ఎలా నిర్ణయం తీసుకుంటాయంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రశ్నించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే కమిటీలు పనిచేస్తున్నాయని, ఎంపిక ప్రక్రియలో వ్యక్తిగత నిర్ణయాలకు తావుండదని కమిటీ సభ్యులు స్పష్టం చేసినట్లు తెలిసింది. కమిటీతో కలసి పని చేయగలిగితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో విధిలేక వారితో కలసి కమిటీలో కూర్చున్నట్లు తెలిసింది.
మేయర్ పీఠానికి బీజేపీ పోటీ
అనంతపురం మేయర్ పదవిని బీజేపీకి కేటాయించారని కూటమి నేతలు చెబుతున్నారు. డాక్టర్ వసుంధరాదేవి కుమారుడు డాక్టర్ విక్రమ్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందంటున్నారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వైఎస్సార్సీపీ ముందంజ
కూటమి అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కమిటీ
రిజర్వేషన్ల దెబ్బకు కూటమి ద్వితీయశ్రేణి నేతల్లో తీవ్ర అసంతృప్తి
జనసేన, టీడీపీ, బీజేపీల్లో దిశానిర్దేశం కరువు


