అమల్లోకి ఎన్నికల కోడ్‌ | - | Sakshi
Sakshi News home page

అమల్లోకి ఎన్నికల కోడ్‌

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

అనంతపురం అర్బన్‌/అనంతపురం క్రైం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న సిబ్బంది నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ సూచించారు. గురువారం ఉదయం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళిని వివరించారు.

ప్రచారంలో హద్దులు దాటితే చర్యలు

కులం, మతం, భాష, ప్రాంతం ఆధారంగా ఓట్లు అడగడం నిషేధం. ఆలయాలు, మసీదులు, చర్చీలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించకూడదు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై నిరాధార ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారం చేయడం, వారి నివాసాల వద్ద నిరసనలు నిర్వహించడం కూడా నిబంధనలకు విరుద్ధం. అనుమతి లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై పార్టీ జెండాలు కట్టడం, పోస్టర్లు అంటించడం, నినాదాలు రాయకూడదు. ఓటర్లకు నగదు, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలు చూపకూడదు.

సభలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి

బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనుమతించిన సభలు, ర్యాలీల వద్ద ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్‌స్పీకర్లను వినియోగించాలి.

పోలింగ్‌కు ముందు ప్రచారం బంద్‌

ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ గడువు 44 గంటలు. పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయకూడదు.

ప్రభుత్వ వనరుల వినియోగంపై ఆంక్షలు

ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు, నిధులు, సిబ్బందిని ఉపయోగించడం నిషేధం. కొత్త పథకాలు, ప్రాజెక్టులు, పనులకు ఆమోదాలు తెలపడం, ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం, కొత్త హామీలు ఇవ్వడం వంటి చర్యలపై ఆంక్షలు ఉంటాయి. తాత్కాలిక నియామకాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకూడదు.

ఖర్చుల వివరాలు సమర్పించాలి

ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రోజువారీ రికార్డులను నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన వ్యయ పరిమితిని మించకూడదు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా మొత్తం ఎన్నికల ఖర్చు వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి. ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులకు అభ్యర్థులు, ఏజెంట్లు తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే న్యాయస్థానాల్లో క్రిమినల్‌ కేసుల విచారణ ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టవచ్చు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కులం, మతం పేరుతో ఓట్లు అడిగిందుకు వీల్లేదు

అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక నిఘా

ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement