సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

అనంతపురం అర్బన్‌: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెన్షన్‌, జీపీఎఫ్‌ ఆదాలత్‌ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ శాంతిప్రియ పేర్కొన్నారు. రెండోరోజు గురువారం పెన్షన్‌, జీపీఎఫ్‌ అదాలత్‌ను ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారం అంశంపై నిర్వహించారు. కార్యక్రమానికి అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాష్‌కుమార్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ మాట్లాడుతూ ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలను ఏ దశలోనూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సంబంధిత అధికారులు సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు రోజుల అదాలత్‌ కార్యక్రమంలో 75 పెన్షన్‌ ఆథరైజేషన్లు, 111 జీపీఎఫ్‌ ఆతరైజేషన్లు జారీ చేశామన్నారు. అదే విధంగా పెన్షన్‌, జీపీఎఫ్‌, సీఎఫ్‌ఎంఎఫ్‌కు సంబంధించి 160 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తరువాత వారికి అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో పొందేలా చూడడం అధికారులు బాధ్యత అన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా డీడీ రమణయ్య, శ్రీ సత్యసాయి జిల్లా డీడీ నాగరాజు, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు విజయకుమార్‌, సీనియర్‌ ఏఓలు సురేష్‌, రమేష్‌, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా

జరిగేందుకు సహకరించండి

గుంతకల్లుటౌన్‌/గుత్తి/అనంతపురం సెంట్రల్‌: మున్సిపల్‌ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ జగదీష్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ లక్ష్మిదేవి, డీఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్‌ బాయ్స్‌ హైస్కూల్‌లో స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అలాగే గుత్తిలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నామినేషన్‌ ప్రక్రియ పై మున్సిపల్‌ కమిషనర్‌ సురేంద్రతో మాట్లాడారు. తర్వాత అనంతపురం నగరపాలకసంస్థ, ఆర్ట్స్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ, డిజిటల్‌ సెక్యూరిటీ, అగ్నిమాపక జాగ్రత్తలు, మూడంచెల భద్రతా వ్యవస్థకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక వార్డుల్లో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణపై చర్చించారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టిభద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement