రైతు ఆదాయం పెంపే లక్ష్యం
అనంతపురం అర్బన్: రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రాథమిక రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుసంపద అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి రైతులకు ఆదాయం పెంచాలని చెప్పారు. ఎరువులు అధిక ధరలకు విక్రయించకుండా చూడాలన్నారు. సీసీఆర్‌సీ పొందిన కౌలు రైతులకు పంటరుణాలను బ్యాంకులు మంజూరు చేయాలన్నారు. రాయితీపై డ్రిప్ పరికరాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ అధికారి రవికుమార్, ఉద్యాన శాఖ అధికారి పద్మలత, ఆత్మ పీడీ నారాయణనాయక్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, సెరికల్చర్ ఏడీ రేణుక, డ్వామా పీడీ సలీంబాషా, డీసీఓ అరుణకుమారి, నాబార్డ్ మేనేజర్ అనురాధ, డీఆర్‌డీఏ ఏపీడీ రాధారాణి, ఎఫ్‌పీఓ సభ్యులు, అగ్రిటెక్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
మాతా శిశు మరణాలకు చోటివ్వరాదు
మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మాతా శిశు మరణాల అంశంపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రెండు మాతృ మరణాలపై విచారణ వివరాలను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ డెలివరీ చేయాలని ఆదేశించారు. ప్రసవాలు ప్రభుత్వ లేదా అధీకృత ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలన్నారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా అత్యవసర ప్రసూతి వైద్య సేవలను బలోపేతం చేయాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులురెడ్డి, డీసీహెచ్‌ఎస్ సెల్వంరాజ, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ గంగాధర్‌రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ శశికళ పాల్గొన్నారు.


