గుత్తి: గుత్తి పట్టణంలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. నెల రోజులుగా నకిలీ నోట్ల చలామణి అవుతుండటంతో వ్యాపారులు, జనాలు బెంబేలెత్తి పోతున్నారు. అమృత్ సినిమా థియేటర్ ఎదురుగా హోటళ్లకు విచ్చేసిన కస్టమర్లు అల్పాహారం తిన్న తర్వాత బిల్లు చెల్లించారు. వారు ఇచ్చిన వంద రూపాయల నోట్లను హోటల్ నిర్వాహకులైన వలి, షారూక్, బాషా కొంతసేపటి తర్వాత గమనిస్తే నకిలీవని తేలడంతో ఆందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే హోటళ్లు, వ్యాపార సముదాయాలను టార్గెట్‌గా చేసుకుని నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా వాటిని గుర్తించలేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ నిర్వాహకుడు షారూఖ్ మాట్లాడుతూ తన హోటల్‌లో టిఫిన్ చేసిన అనంతరం వ్యక్తి ఇచ్చిన రూ.100 నోటు నకిలీదని గుర్తించలేకపోయినట్లు తెలిపాడు. ఇలా మూడుసార్లు తాను మోసపోయానని వాపోయాడు. రెండు రోజుల క్రితం తనకూ ఓ కస్టమర్ రూ.100 నకిలీ నోటు ఇచ్చాడని మరో హోటల్ నిర్వాహకుడు వలి తెలిపాడు. సాయంత్రం డబ్బు లెక్కిస్తున్న సమయంలో అది దొంగ నోటని గుర్తించానన్నాడు. అధికారులు స్పందించి దొంగ నోట్ల చలామణిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


