తాగుడు మానేయమంటే ఉరేసుకున్నాడు! | - | Sakshi
Sakshi News home page

తాగుడు మానేయమంటే ఉరేసుకున్నాడు!

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

కణేకల్లు: సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెడితే కుటుంబ పోషణ ఎలా? అంటూ భార్య నిలదీయడంతో క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కణేకల్లు మండలం మాల్యం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఎం.రాజశేఖర్‌ (25)కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల మద్యానికి బానిసైన రాజశేఖర్‌ సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెట్టసాగాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఇదే అంశంపై బుధవారం భార్య నిలదీసింది. తాగుడు మానేసి బంధుమిత్రుల వద్ద పరువు నిలుపుకోవాలని హితవు పలికింది. దీంతో క్షణికావేశానికి లోనైన రాజశేఖర్‌ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

రైతులకు సకాలంలో విద్యుత్‌ కనెక్షన్లు

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌

అనంతపురం టౌన్‌: రైతులకు వ్యవసాయ కనెక్షన్లను సకాలంలో మంజూరు చేయనున్నట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉండగా, ప్రతిపాదనలను ఇప్పటికే కార్పొరేట్‌ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. అక్కడి నుంచి అనుమతులు కాగానే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ వ్యవసాయ కనెక్షన్‌ మంజూరు చేస్తామన్నారు. రాబోవు 6 నెలల కాలంలో సీనియార్టీ మేరకు దశల వారీగా వ్యవసాయ కనెక్షన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

యువకుడి దుర్మరణం

ముదిగుబ్బ: ఐస్‌క్రీమ్‌ బండి ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన చాంద్‌బాషా, సహీన దంపతుల కుమారుడు హైదర్‌బాషా (18) వ్యక్తిగత పనిపై బుధవారం ముదిగుబ్బకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ఇందుకూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న ఐస్‌క్రీమ్‌ విక్రయించే వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన హైదర్‌బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కోర్టుకు హాజరుకాని ఇద్దరి అరెస్ట్‌

తనకల్లు: న్యాయస్థానం కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు తనకల్లు పీఎస్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. తనకల్లు మండలం దేవళంతండా, పెనుగుండుతండాకు చెందిన ఓబులేసు, నాగరాజునాయక్‌ గతంలో మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుల్లో అప్పట్లో న్యాయస్థానానికి హాజరైన వారు ఆ తర్వాత కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరగసాగారు. దీంతో ఇద్దరిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ కావడంతో బుధవారం అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement