అనంతపురం కల్చరల్: సెల్‌ఫోన్ చేస్తున్న వింతలు, విడ్డూరాలతో అరచేతి లోనే సాహిత్యం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయినా పుస్తకాలకున్న ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. వందల సంఖ్యలో నేటికీ వస్తూనే ఉన్నాయి. ప్రతి పుస్తకంలో అనుభవాలసారంతో జీవితాన్ని నిర్దేశించే లక్ష్యం దాగుంటుంది. మానసిక వికాసానికి దోహదపడే అలాంటి పుస్తకాలకు చరిత్ర పుటల్లో అందమైన స్థానాన్ని కల్పించారు. చదవటం, రాయడం, ప్రచురించడం, కాపీరైట్స్... తదితరాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకానికి ఆదరణ తగ్గలేదని చాటే కార్యక్రమాలు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ఆ రోజే ఎందుకు?
ప్రపంచ సాహిత్య శిఖరాల్లో అగ్రభాగాన నిలిచిన ‘డాన్ క్విక్సోట్’ నవల రచయిత, స్పెయిన్‌కు చెందిన మిగుల్ డె సెర్‌వాన్‌టెస్ పుట్టింది అక్టోబర్ 7 కాగా, ఏప్రిల్ 23న మరణించారు. ఈ క్రమంలో ఆయనకు గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో ఆయన జయంతి నాడు పుస్తక దినోత్సవం జరపాలని ప్రముఖ స్పానిష్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్ ఆలోచన చేశాడు. అయితే విలియం షేక్స్‌పియర్, గార్సియాసా డి లా వేగా తదితర ఎందరో ప్రముఖ రచయితలు మరణించింది ఏప్రిల్ 23 కావడంతో అందరి జ్ఞాపకార్థం 1995, ఏప్రిల్ 23న యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
ఆదివారం వస్తే రచయితలకు పండుగే
పుస్తకం చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోతోందని పాత తరం వారంటున్నా దిగ్గజ రచయితలతో పాటూ యువ రచయితలు పోటీ పడి రచనలు సాగిస్తుండడం విశేషం. సాధారణ రచనలతో పాటూ అవార్డులు, రివార్డులందుకుంటున్న రచనలు ఇటీవల కోకొల్లలుగా ముద్రితమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వచ్చిందంటే అనంతపురంలోని ఎన్జీఓ హోమ్, ప్రెస్‌క్లబ్‌లు పుస్తకావిష్కరణలకు సిద్దమవుతాయి. ఒకప్పుడు ఒకే రోజు రెండు మూడు పుస్తకాలు పాఠకుల ముందుకొచ్చేవి. ప్రత్యేక ప్రణాళిక, ఒప్పందం అనంతరం ఒక ఆదివారం ఒక్కటే అన్నట్లుగా నిర్ణయించుకోవడంతో ప్రతి ఆదివారమూ రచయితలకు, పుస్తక ప్రియులకు ఓ పండుగలా మారింది.
ఆదరణలోనూ విభిన్నమే
కాల్పనిక సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, విప్లవ సాహిత్యం, ఆధునిక సాహిత్యం... ఇలా ఒకప్పుడు రాజ్యమేలిన నవలలు మళ్లీ ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. అలాగే ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస పుస్తకాలకూ తరగని ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా యువ రచయితలు పెరుగుతుండడంతో కవిత్వంలో వస్తున్న పెనుమార్పులతో పుస్తకాదరణ పెరుగుతోంది. పుస్తక దినోత్సవం వచ్చేనాటికి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు వచ్చేస్తున్న నేపథ్యంలో పుస్తక పఠనం వైపు విద్యార్థులను మళ్లించాలని మేధావులంటున్నారు.
నగరంలో ప్రతి ఆదివారమూ ఓ పుస్తకావిష్కరణే
పుస్తకాలు మరో ప్రపంచానికి కిటికీ లాంటివి. ప్రతి పేజీతో మనకు కొత్త వ్యక్తులను, కొత్త సంస్కృతులను, కొత్త ఆలోచనలను పరిచయం చేస్తాయి. ఒక పుస్తకాన్ని మొదటిసారి చదివితో ఓ కొత్త స్నేహితుడిని సంపాదించుకున్నట్లు ఉంటుంది. అదే పుస్తకాన్ని మరోసారి చదివితే పాత స్నేహితుడిని కలుసుకున్న ఆనందం కలుగుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పుస్తకానికి చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారు. 1995 నుంచి ఏప్రిల్ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
పఠనాసక్తి పెరిగింది
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండకపోవడం దాని స్వాభావిక లక్షణం. ఇంటర్నెట్ విపరీతంగా పెరిగిపోతున్న రోజుల్లోనూ మళ్లీ పుస్తక పఠనానికి ఆదరణ పెరుగుతుండడం ఆహ్వానించదగిన విషయం. లుక్ కల్చర్ నుంచి బుక్ కల్చర్ వైపుగా యువత పయనం సాగుతోంది. నేను రాసిన బుజ్జోని కల, ఒక కత్తుల వంతెన, అనంత రత్నాలు వంటి పుస్తకాలను అప్పటి కంటే ఇప్పుడే మళ్లీ అడిగి చదువుతుండడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉండే రచయితల పుస్తకాలకు ఆదరణ ఉంటోంది.
– చంద్రశేఖరశాస్త్రి,
స్పందన అనంత కవుల వేదిక
సందర్భం ః
నేడు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం


