అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన మెరుగుపరచడానికి ‘క్లిక్కర్ ఆధారిత లర్నింగ్’ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 143 స్కూళ్లు ఎంపికయ్యాయి. 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన క్లిక్కర్ పరికరాలను బుధవారం ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు అందజేసి, మాట్లాడారు. ఈ విధానం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి సహాయపడుతుందన్నారు. ప్రతి విద్యార్థికి ఒక చిన్న బ్లూటూత్ క్లిక్కర్ పరికరం ఇస్తారన్నారు. ఉపాధ్యాయులు పాఠం బోధించిన తర్వాత ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ) లేదా స్మార్ట్ టీవీలో బహుళైచ్చిక ప్రశ్నలు ప్రదరిస్తారు. వెంటనే విద్యార్థులు తమవద్ద ఉన్న క్లిక్కర్ ద్వారా సరైన సమాధానం బటన్ నొక్కుతారు. ఎంతమంది విద్యార్థులు, ఏయే విద్యార్థులు సరైన సమాధానం, తప్పు సమాధానం ఇచ్చారో క్లిక్కర్ డివైజ్ ద్వారా తెలుస్తుందని తెలిపారు.
ధర్మవరంలో నేటి నుంచి
బ్రహ్మోత్సవాలు
ధర్మవరం అర్బన్: ఈ నెల 23 నుంచి మే 3వ తేదీ వరకూ ధర్మవరంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అడహక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వరప్రసాద్ వెల్లడించారు. 23న ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభం కానున్నాయి. 24న ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. 25న ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం సింహ వాహనం, 26న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమద్వాహనం, 27న ఉదయం పల్లకీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం ఉంటాయి. 28న ఉదయం గరుడోత్సవం, సాయంత్రం శేష వాహనం, రాత్రి గజ వాహన సేవలు నిర్వహిస్తారు. 29న ఉదయం 7గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4గంటలకు బ్రహ్మ రథోత్సవం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6గంటలకు ధూళోత్సవం నిర్వహిస్తారు. 30న సాయంత్రం అశ్వవాహనం, మే 1న ఉదయం 6గంటలకు వసంతోత్సవం, 10గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6గంటలకు హంస వాహన సేవలు ఉంటాయి. 2న సాయంత్రం 6గంటలకు దేవతా ఉద్వాసన, 3న ఉదయం 9గంటలకు పుష్ప యాగం, సాయంత్రం శయనోత్సవంతో ఉత్సవాలను ముగిస్తారు.


