మ్యుటేషన్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

మ్యుటేషన్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

రెవెన్యూ అధికారులకు జేసీ విష్ణుచరణ్‌ ఆదేశం

అనంతపురం అర్బన్‌: మ్యుటేషన్‌ కోసం రైతుల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ రెవెన్యూ ఆదేశించారు. మ్యుటేషన్‌ దరఖాస్తుల పరిష్కారం, గ్యాస్‌ సిలెండర్ల పంపణీ, తదితర అంశాలపై బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, సీఎస్‌డీటీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జేసీ సమీక్షించారు. మ్యుటేషన్‌కు సంబంధించి పరిష్కార వేదిక, ఏపీ సేవా, మీ సేవా ద్వారా అందిన అభ్యర్థనలపై క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించాలన్నారు. 22ఏ, చుక్కల భూములకు సంబంధించిన ప్రతిపాదనలు నిర్ధిష్ట సమయంలో సిద్ధం చేసి ఆమోదం కోసం కలెక్టర్‌కు పంపించాలన్నారు. నాల్గో విడత రీసర్వే లో భాగంగా గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పనులకు మొబైల్‌ అప్లికేషన్‌ ఇచ్చారన్నారు. సర్వే చేసేటప్పుడు సంబంధిత రైతులు హాజరయ్యేలా సమాచారం ఇచ్చి వారితో ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌డీటీలను ఆదేశించారు. సిలిండర్ల అక్రమ నిల్వలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియలో ముందుగా డ్రాప్ట్‌ పట్టాదారు పుస్తకం ప్రింట్‌ తీసుకుని రైతులకు చూపించాలన్నారు. అందులో సవరణలు ఉంటే గుర్తించి, కరెక్షన్‌ మాడ్యూల్‌ ద్వారా మార్పులు చేర్పులతో కచ్చితమైన పాసుపుస్తకాలను రైతులకు అందించాలని ఆదేశించారు. వీసీలో డీఆర్‌ఓ ఎ.మలోల, కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌ అఖిల, సర్వే శాఖ ఏడీ విజయసారథి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జీఎం రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement