ఆత్మకూరు: మండలంలోని కుర్లపల్లి వద్ద పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం ఎస్‌ఐ గౌతమ్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం కుర్లపల్లి శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో ఓ తోట వద్ద పేకాట ఆడుతూ ఐదుగురు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.6,570 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు.
మహిళల భద్రతకు ‘సీ్త్ర రక్ష’ : ఎస్పీ
అనంతపురం సెంట్రల్: మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన శక్తియాప్, సీ్త్ర రక్ష పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. బుధవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్‌లు బాధిత మహిళలకు రక్షణగా నిలుస్తాయన్నారు. చిన్నారులపై జరిగే నేరాలపై చట్టం కఠినంగా అమలవుతుందని హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద కాల్స్ మెసేజ్‌లు, యాప్‌లకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోరాదని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మజ, న్యాయవాది శశికళ, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.
25న పారిశ్రామిక వేత్తలకు శిక్షణ
అనంతపురం టౌన్: మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ నెల 25న శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ ఆధ్వర్యంలో అనంతపురం శివారు పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఉన్న మహిళా పారిశ్రామిక వేత్తలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


