తాడిపత్రి రూరల్: కూలీల వలసల నివారణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ ఏడాది వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ (వీబీ జీ రామ్ జీ)గా మారింది. ఇదివరకు ఏడాదికి వంద రోజుల పనిదినాలు కల్పించేవారు. కొత్తగా ఆ సంఖ్యను 125 దినాలకు పెంచింది. కూలీల ఉపాధికి మెరుగైన హామీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే అందుకు అనుగుణంగా కూలీలకు పని ప్రదేశాల్లో కల్పించాల్సిన సౌకర్యాలను మాత్రం విస్మరిస్తోంది. జిల్లాలో దాదాపు 4.48 లక్షల మంది కూలీలు ఉన్నారని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. పనులకు హాజరవుతున్నవారు 3.55 లక్షల మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద వీరికి 60 రకాలకు పైగా పనులను అధికారులు కల్పించాల్సి ఉంది.
వేసవి అలవెన్సులపై అలసత్వం..
ఉపాధి పనుల్లో పాల్గొనే కూలీలకు వేసవి భత్యం అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూలీలు చేసిన పనులకు సంబంధించి కూలిలో అదనంగా 30 శాతం వేసవి భత్యం చెల్లించింది. ప్రస్తుతం అలవెన్సు గురించి పట్టించుకునే నాథులే లేరు. ఇక చాలా ఏళ్లుగా కూలీలకు పనిముట్లను పంపిణీ చేయడం లేదు. గడ్డ పారల మరమ్మతులకు రూ.10, గంపకు రూ.5, మంచినీటి కోసం రూ.5, ఐదు కిలోమీటర్లకుపైగా దూరం నుంచి వచ్చిన కూలీలకు రూ.20 చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.
ముఖ హాజరుపై తీవ్ర వ్యతిరేకత..
కూలీలకు ముఖ హాజరు ప్రవేశ పెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డిజిటల్ విధానం అమలుతో వేతనం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం కూలీలను వెంటాడుతోంది. నెట్‌వర్క్ పనిచేయక, సిగ్నల్ దొరకపోవడం తదితర సాంకేతిక కారణాల వల్ల ముఖ హాజరు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ముఖ హాజరును రద్దు చేసి పాత పద్ధతి అమలు చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ కింద పనులు చేసే కూలీలకు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇటువంటి సమయంలో ఎండలో ఉంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. పని ప్రదేశంలో కూలీలకు నీడ, మజ్జిగ– మంచినీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఫలితంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పనిచేసే ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించాం. కూలీలకు అవసరమైన పనిముట్లు ప్రభుత్వం నుంచి రాలేదు. అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫస్టు ఎయిడ్ బాక్స్‌లను ఉంచాలని సూచించాం. కూలీలు సేద తీరడానికి టెంట్లు వేయాలని చెప్పాం. వాటి ఏర్పాటులో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం.
– రాజ్యలక్ష్మి, ఏపీఓ, ఉపాధి హామీ, తాడిపత్రి
ఉపాధి సరే.. సౌకర్యాలేవీ..?
సేద తీరడానికి టెంట్లు కరువు
నీళ్లు – మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు లేక కూలీలు సతమతం
అమలు కాని వేసవి అలవెన్సు
పనిముట్ల పంపిణీని విస్మరించిన ప్రభుత్వం
సదుపాయాలు ఎక్కడ..?
జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిలువ నీడ లేక ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పని ప్రదేశంలో కూలీలు సేద తీరటానికి, భోజనాలు చేయడానికి టెంట్లు వేయాల్సి ఉంది. అయితే ఎక్కడా టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల నీడన సేద తీరుతూ, భోజనాలు చేయాల్సి వస్తోంది. చెట్లు లేని చోట ఎండల్లోనే మగ్గుతున్నారు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, పనులు జరిగే సమయంలో కూలీలు గాయాలపాలైతే వారికి చికిత్స కోసం అయోడిన్ బాటిల్, బ్యాండేజీ, దూది తదితర వస్తువులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచాలని నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. తీవ్రమైన ఎండల బారినపడి కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఎక్కడా అందుబాటులో ఉంచిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కొన్నిచోట్ల తాగడానికి నీళ్లు కూడా లేకపోవడంతో కూలీలు ఇంటి నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు.


