మా మొర ఆలకించండి | - | Sakshi
Sakshi News home page

మా మొర ఆలకించండి

Apr 21 2026 4:38 AM | Updated on Apr 21 2026 4:38 AM

చీనీ చెట్లు ఎండిపోతున్నాయ్‌

అనంతపురం అర్బన్‌: ‘మా కష్టం పగోడికి కూడా రాకూడదు. చెరువుల్లో నీరు లేక బోర్లు అడుగంటి దాదాపు వెయ్యి ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులపాలై చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన వస్తుంది’ అని గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామ రైతులు సుబ్బయ్య, రామచంద్ర, తాతిరెడ్డి, కిష్టప్ప, వెంకటేశ్వరరెడ్డి, ఎర్రిస్వామి, రాయలసీమ రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అక్బర్‌ ఆవేదన చెందారు. సోమవారం వారు కలెక్టరేట్‌లో ఆందోళన చేశారు. బ్రాహ్మణపల్లి చెరువు, ఓటికుంట చెరువు, రామాకుల చెరువుల్లో నీరు లేకపోవడంతో సమీపంలోని వ్యవసాయ బోర్లు అడుగంటి చీనీ చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా నీటితో ఈ చెరువులను నింపకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తమ గ్రామాన్ని కలెక్టర్‌ సందర్శించి, పంటల దుస్థితిని చూసి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అదేశారు.

పరిష్కార వేదికకు 504 అర్జీలు

అనంతపురం అర్బన్‌: తమ మొర ఆలకించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 504 అర్జీలను జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌తో పాటు డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, రామ్మోహన్‌, మల్లికార్జునరెడ్డి, రమేష్‌రెడ్డి స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. అందే ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.

వినతుల్లో కొన్ని

అనంతపురంలోని సంగమేష్‌నగర్‌లో నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలం కబ్జాకు గురవుతోందని ఓబులేసు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపాడు. ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.

విద్యుతాఘాతానికి గురై కాలిపోయిన గంధం చెట్లకు సంబంధించి వాల్యుయేషన్‌ సర్టిఫికెట్‌ను డీఎఫ్‌ఓ కార్యాలయంలో ఇవ్వడం లేదని రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన ప్రకాష్‌ ఫిర్యాదు చేశాడు, గుమ్మఘట్ట మండలం భూపసముద్రం సర్వే నంబరు 164–బిలోని తమ పొలంలో 2,500 గంధపు చెట్లను 15 ఏళ్లుగా పెంచుతున్నానని చెప్పాడు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా 1,800 చెట్లు, మోటార్లు, పైపులు కాలిపోయాయనని తెలిపాడు. చెట్లకు నష్టపరిహారం కోసం వెళితే అటవీశాఖ నుంచి వాల్యుయేషన్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని అధికారులు చెప్పారన్నారు. అటవీశాఖ అధికారులేమో ఇవ్వడం లేదన్నారు. తనకు నష్టపరిహారం అందేలా చూడాలని వేడుకున్నాడు.

అనంతపురం శివారులోని రాజీవ్‌కాలనీ పంచాయతీ ప్రియాంకనగర్‌లో నివాసముంటున్న చాకలి వెంకటేష్‌ అనే దివ్యాంగుడు తనకు పింఛన్‌ మంజూరు చేయాలని అధికారులను కోరాడు. 50 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్‌ ఉందని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదని తెలిపాడు.

గుంతకల్లు మండలం నెలగొండ గ్రామ సర్వేనంబరు 263లో 4.22 ఎకరాలు పట్టా భూమి తనకు తాతల నుంచి సంక్రమించిందని, అయితే రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో తన పేరు తొలగించి వేరొకరి పేరు మీద భూమి ఎక్కించారని రైతు నెట్టికల్లు ఆవేదన వ్యక్తం చేశాడు. వీఆర్‌ఓతో పాటు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఆన్‌లైన్‌లో పేరును సరిచేయడం లేదన్నాడు. తన సమస్య పరిష్కరించాలని అధికారులను కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement