అనంతపురం అర్బన్: భూమిపై శ్రమజీవులతోనే సమాజం నిర్మితమయ్యిందని, మానవత్వమే జీవనాధారమని విశ్వగురువు బసవేశ్వరుడు చాటి చెప్పారని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర జయంతికి జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బసవేశ్వరుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించి, మాట్లాడారు. కులమత, వర్గ, వర్ణ భేదం లేకుండా అందరూ సమానులేని చాటి చెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ చైర్‌పర్సన్ తుల్జాపూర్ స్వప్న, పర్యాటక శాఖ అధికారి జయకుమార్‌బాబు, రీజనల్ డైరెక్టర్ ఓబుళమ్మ, డ్వామా పీడీ సలీంబాషా, ఆర్కియాలజీ ఏడీ స్వామినాయక్, శిల్పారామం ఏఓ సుధాకర్, వీరశైవ సమాజం అధ్యక్షుడు ఎంజీ రాజు, ప్రధాన కార్యదర్శి గౌలి, ప్రతినిధులు సతీష్‌కుమార్, ఈశ్వర ప్రసాద్, చిరంజీవి, గోపాల్, గంగాధర్, శివ, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
28 నుంచి పెన్నహోబిలం
బ్రహ్మోత్సవాలు
● మే 6న బ్రహ్మ రథోత్సవం
ఉరవకొండ రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మే ఆరో తేదీ బ్రహ్మ రథోత్సవం (తేరు) జరగనుంది. బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఈఓ సాకే రమేష్‌బాబు, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. ఈఓ మాట్లాడుతూ ఈ నెల 28న ఆమిద్యాల నుంచి ఉత్సవమూర్తులను పెన్నహోబిలం క్షేత్రానికి తీసుకురావటంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయన్నారు. 29న ప్రాకారోత్సవం, 30న ఉదయం సింహ వాహనోత్సవం, సాయంత్రం చంద్రప్రభ వాహనోత్సవం, మే 1న ఉదయం గోవాహనోత్సవం, సాయంత్రం శేష వాహనోత్సవం, 2న హంస వాహనోత్సవం, 3న హనుమద్ వాహనోత్సవం, 4న గరుడ వాహనోత్సవంతో పాటు స్వామి వారి కల్యాణోత్సవం, 5న ఉదయం సూర్యప్రభ వాహనోత్సవం సాయంత్రం ఐరావత వాహనోత్సవం ఉంటుందన్నారు. 6న బ్రహ్మ రథోత్సవం, 7న అశ్వ వాహనోత్సవం, 8న ధ్వజారోహణ, 8న శయనోత్సవం, 9న ఉత్సవమూర్తులను తిరిగి ఆమిద్యాల గ్రామానికి చేర్చటంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
టీచర్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలు సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ తాత్కాలిక జాబితా సిద్ధం చేసినట్లు ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలలో పనిచేస్తున్న ఎస్జీటీలు, పాఠశాల సహాయకులు, హెచ్‌ఎంల సీనియార్టీ జాబితాలను (సబ్జెక్టు వారీగా, మీడియం వారీగా) సిద్ధం చేశామన్నారు. deo anantapur. blogspot. com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ సీనియారిటీ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23లోగా పనిదినాల్లో మాత్రమే డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయడి పూర్తి పేరు, హోదా సంబంధిత వివరాలు, సీనియార్టీ జాబితాలో తప్పిదం ఎక్కడ జరిగిందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆధారాలు జత చేయాలని సూచించారు. జాబితాలో పేర్లు లేని ఉపాధ్యాయులు కచ్చితంగా వారి వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎంఈఓలు, హెచ్‌ఎంలు ఈ సీనియార్టీ జాబితాలను పరిశీలించి తమ పరిధిలో ఉన్న టీచర్లు సస్పెన్షన్‌లో ఉన్నా, సెలవుపై ఉన్నా, ఏ ఇతర కారణాల వల్ల తాత్కాలిక జాబితాలో లేకపోతే వెంటనే కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. లేదంటే ఎంఈఓలు, హెచ్‌ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఫారెన్ సర్వీస్‌లో పని చేస్తున్న టీచర్లు కూడా తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్నారో లేదో పరిశీలించుకోవాలన్నారు.


