నిధులు సరే.. నీళ్లు పారవా? | - | Sakshi
Sakshi News home page

నిధులు సరే.. నీళ్లు పారవా?

Apr 21 2026 4:38 AM | Updated on Apr 21 2026 4:38 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల పేరుతో నిధులు తప్ప నీళ్లు పారడం లేదు అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులంటే రైతులకు నీళ్లు ఇవ్వడానికనేది వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్వచనమైతే, కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమనేది చంద్రబాబు నిర్వచనమని అన్నారు. హంద్రీ–నీవా కాలువకు దివంగత ఎన్టీఆర్‌ డీపీఆర్‌ చేయించారన్నారు. 40 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా తీసుకురావడం సాధ్యం కాదని చెప్పి 5 టీఎంసీల తాగునీటికి పరిమితం చేస్తూ చంద్రబాబు జీఓ తెచ్చారన్నారు. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత తిరిగి 40 టీఎంసీల సామర్థ్యానికి పెంచారన్నారు. పనులు మొదలుపెట్టి జీడిపల్లి రిజర్వాయర్‌ వరకు నీళ్లు తెచ్చారన్నారు. రెండోదశ పనులు దాదాపు 70 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు.

హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్‌ మీదే..

తామే హంద్రీ–నీవాను తీసుకొచ్చామని, జిల్లాను సస్యశ్యామలం చేశామని, ఆ క్రెడిట్‌ తమదేనంటూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని తోపుదుర్తి విమర్శించారు. హంద్రీ–నీవాను నాశనం చేసిన క్రెడిట్‌ మీదేనని మండిపడ్డారు. మొన్నటిదాకా 2,200 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వచ్చాయన్నారు. అయితే టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా 52 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

నాసిరకంగా కాంక్రీట్‌ పనులు..

కుప్పంకు నీళ్లు తీసుకుపోవాలనే ఉద్దేశంతో హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్‌ లైనింగ్‌ చేయించారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఫలితంగా కాలువ కింద ఉన్న వందలాది గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి వేలాది బోర్లు ఎండిపోయాయన్నారు. బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రూ.3,850 కోట్లతో కాలువ లైనింగ్‌ పనులు చేపట్టారన్నారు. అనంతపురం నుంచి చిత్తూరు దాకా వందచోట్ల లైనింగ్‌లో కంకర మొత్తం రాలిపోయిందంటే పనులు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబుకు ఆదాయం వస్తుందంటేనే పనులు చేపట్టి.. దానికి అభివృద్ధి అని పేరు పెడతారన్నారు. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా నామమాత్రపు ఖర్చుతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా... పట్టించుకోలేదన్నారు. ఎందుకంటే వారికి నిధులు పారాలి తప్ప నీళ్లు అవసరం లేదన్నారు. హంద్రీ–నీవా కాలువను వారి ఆదాయ మార్గాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. పొలాలకు నీళ్లివ్వాల్సిన ప్రాజెక్ట్‌ను కాంట్రాక్టర్లకు వరప్రదాయణిగా మార్చుతున్న మీదీ బతుకేనా? అంటూ మండిపడ్డారు. నాసిరకం లైనింగ్‌ పనులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లకాలువల నిర్మాణాలకు టెండర్లు పిలిచి, పూర్తి చేయాలని, లేదంటే ప్రజాకోర్టులో తప్పకుండా శిక్ష వేస్తారని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, వైస్‌ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, మామిళ్లపల్లి అమర్‌నాథరెడ్డి, కనగానపల్లి అంకే అశోక్‌, శేఖర్‌, సనప గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే తహతహ

హంద్రీ–నీవా లైనింగ్‌తో

అడుగంటిన భూగర్భజలాలు

చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement