కొత్త పంటల సాగుపై తొందర పడకండి | - | Sakshi
Sakshi News home page

కొత్త పంటల సాగుపై తొందర పడకండి

Apr 21 2026 4:38 AM | Updated on Apr 21 2026 4:38 AM

అనంతపురం అగ్రికల్చర్‌/గుంతకల్లు రూరల్‌/ గార్లదిన్నె: యాపిల్‌, లాంగాన్‌, మకాడమియా, అవకాడో, లిచీ, లక్ష్మణఫలం లాంటి కొత్త రకం పండ్లతోటలు సాగు చేయడానికి తొందరపడకుండా కొంతకాలం రైతులు వేచిచూడాలని ఉద్యానశాఖ అడిషినల్‌ డైరెక్టర్లు సీహెచ్‌ హరినాథరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ తిరుపతిరెడ్డి సూచించారు. జిల్లాలో మూడు మండలాల పరిధిలో రైతులు సాగు చేసిన యాపిల్‌ పంటతో పాటు కొత్త రకం పంటల గురించి ఇటీవల విస్తృతంగా ప్రచారం జరగడంతో వాటి పరిశీలనకు రెండు రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మొదటి రోజు ఆదివారం కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో రైతు నాగరాజు సాగు చేసిన యాపిల్‌ పంట, అలాగే కళ్యాణదుర్గం మండలంలో రైతు కృష్ణమూర్తి సాగు చేసిన డ్రాగన్‌, విభిన్న పద్ధతుల్లో సాగు చేసిన కళింగర పంట, అవకాడో పంటను చూశారు. బెళుగుప్ప మండలం గుండ్లపల్లిలో రైతు రామాంజినేయులు 1.20 ఎకరాల్లో 300 రకాల మామిడి, 30 రకాల జామతో పాటు మొత్తం మీద పలు రకాల పండ్లతోటలు 1,500 చెట్లు కలిగిన తోటను పరిశీలించి రైతు అనుభవాలు తెలుసుకున్నారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న ఆయన వివిధ దేశాల్లో పండించే పలు కొత్త రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్లు గుర్తించారు. రెండో రోజు సోమవారం గార్లదిన్నె మండలం మర్తాడులో రైతు రమణారెడ్డి సాగు చేసిన యాపిల్‌, లాంగాన్‌, కర్జూరం తోటలు, అలాగే గుంతకల్లు మండలంలో రైతు చంద్రశేఖర్‌ సాగు చేసిన మలబార్‌ వేప, సీతాఫలంలో కొత్తరకమైన లక్ష్మణఫలం, లాంగ్‌ మల్బరీ, మకాడమియా, వాటర్‌ యాపిల్‌ తోటలను పరిశీలించి, మాట్లాడారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డైరెక్టర్లు మాట్లాడుతూ కొత్త రకం పంటలను తొందరపడి సాగు చేయవద్దన్నారు. ఒకసారి చేతికిరాగానే పంట వచ్చినట్లేనని భావించి మిగతా రైతులు అదే బాట పడితే సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. యాపిల్‌తో పాటు కొత్త రకాల పండ్లతోటలపై మూడేళ్లు అధ్యయనం చేసిన తర్వాత ముందుకు వెళదామన్నారు. అధ్యయనం చేసే బాధ్యతను రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ తిరుపతిరెడ్డితో పాటు జిల్లాలో ఉన్న మరికొందరు శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement