● 31 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
● హాజరుకానున్న
9,745 మంది విద్యార్థులు
● ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని
డీఆర్‌ఓ ఆదేశం
అనంతపురం అర్బన్: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి పాలిసెట్–2026 ఈ నెల 25న జరగనుంది. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్‌ఓ, పరీక్షల నోడల్ అధికారి మలోల సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై డీఆర్‌ఓ సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆరు పట్టణాల్లోని 31 కేంద్రాల్లో నిర్వహించే పరీక్షకు 9,745 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. కేంద్రానికి ఒకరు చొప్పున ఆరుగురు డిప్యూటీ తహసీల్దార్లను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా నియమించామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద వైద్యశిబరం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పారు. పరీక్ష వేళలకు అనుకూలంగా ఉండేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
గంట ముందే చేరుకోవాలి..
విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని డీఆర్‌ఓ సూచించారు. కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించబోరన్నారు.


