కణేకల్లు: ‘సార్.. గుడి – బడి వద్దే బెల్టుషాపు పెట్టి మద్యం అమ్ముతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు తాగుబోతులు మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. వారి గోల భరించలేకపోతున్నాం’ అంటూ కె.కొత్తపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపును ఎత్తేసి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చూడాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ బ్రహ్మయ్యకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతంలో బెల్టుషాపు తెరిచి రేయింబవళ్లూ మద్యం అమ్ముతున్నారన్నారు. మద్యం తాగిన వారు హల్‌చల్ చేస్తూ పరిసర ప్రాంత ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారన్నారు. తహసీల్దార్ స్పందిస్తూ బెల్టుషాపు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


