మహిళల భద్రతకు శక్తి యాప్‌ : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు శక్తి యాప్‌ : ఎస్పీ

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

గుంతకల్లు టౌన్‌: మహిళలు, బాలికల భద్రతకు శక్తి యాప్‌ ఓ రక్షణ కవచమని ఎస్పీ పి.జగదీష్‌ అన్నారు. సోమవారం సాయంత్రం పాత గుత్తి రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గుంతకల్లు సబ్‌డివిజన్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలికలు, మహిళల భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. విద్యార్థినులు, మహిళలు తమ ఫోన్లలో ఉన్న క్యాండీక్రష్‌, ఇతర చాటింగ్‌ యాప్‌లను తొలగించి శక్తియాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఆపదలో ఉన్న సమయంలో యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణగా నిలుస్తారని చెప్పారు. ఈ యాప్‌ వినియోగం వల్ల గత రెండేళ్లల్లో జిల్లాలో బాలికలు, మహిళలపై 10 శాతం నేరాలు తగ్గాయన్నారు. ఏపీకే ఫైల్స్‌, లోన్‌ యాప్‌లు, సైబర్‌ మోసాలపై చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు నాశనమవుతాయన్నారు. మాదకద్రవ్యాల వినియోగంపై 1972కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే జయరామ్‌, స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం మహిళా పీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, సబ్‌డివిజన్‌లోని సీఐలు మనోహర్‌, ప్రవీణ్‌, రామారావు, శంకర్‌నాయక్‌, రాజు, మహానంది పాల్గొన్నారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ హెల్మెట్‌ ధరించి ద్విచక్రవాహనాన్ని నడిపారు.

అనుమానంతోనే

బాలుడి హత్య

48 గంటల్లోనే మిస్టరీ ఛేదింపు

నిందితుడి అరెస్ట్‌

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం పామురాయి సమీపంలో జరిగిన మైనర్‌ బాలుడి హత్య కేసులో మిస్టరీని 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. అనుమానం పెనుభూతమై ఓ బాలుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చాకలి రామ్మోహన్‌ సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను రూరల్‌ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎన్‌.శేఖర్‌ వెల్లడించారు. ఈ నెల 18న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పామురాయి సమీపంలోని సిమెంట్‌ పెల్లల ఫ్యాక్టరీ వద్ద స్థానిక రజక కాలనీకి చెందిన కళ్యాణ్‌ సాత్విక్‌ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సదరు బాలుడు తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో కక్ష పెంచుకున్న రామ్మోహన్‌ పథకం ప్రకారం జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశానికి బాలుడిని తీసుకెళ్లి సిమెంట్‌ పెల్లలతో తలపై మోది హత్య చేశాడు. దర్యాప్తు చేపట్టిన సీఐ ఎన్‌.శేఖర్‌ నేతృత్వంలోని పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారంరాప్తాడు మండలం కదిరి–అనంతపురం రోడ్డులోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐతో పాటు ఎస్‌ఐ కె. రాంబాబు, మహిళా ఎస్‌ఐ కె. చైతన్య స్వరూపిణి, పీసీలు తిమ్మప్ప, జయరాం నాయక్‌, కె. రాజును అనంతపురం రూరల్‌ డీఎస్పీ టి.శ్రీనివాసులు అభినందించారు.

ఐసీడీఎస్‌ పీడీ

బాధ్యతల స్వీకరణ

అనంతపురం సెంట్రల్‌: ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీగా శశికళ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకూ పనిచేస్తున్న ఎం.శ్రీదేవి తనను ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆమెను తిరిగి బద్వేలు సీడీపీఓగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆమె రిలీవ్‌ అయ్యారు. రాయచోటి సీడీపీఓగా పనిచేస్తూ ఇక్కడికి ఇన్‌చార్జ్‌ పీడీగా బదిలీపై వచ్చిన శశికళకు బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement