అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, బాధితులకు న్యాయం చేకూరడం లేదంటూ పలువురు వాపోయారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 129 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కాగా, సమస్యల పరిష్కారంపై పలువురు ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారపార్టీ నాయకుల సిఫారసులు ఉన్న వారి పక్షానే పోలీసులు నిలుస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఒకే సమస్యపై న్యాయం కోసం పలుమార్లు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
సిఫారసు ఉంటేనే పనులు
ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా దక్కని న్యాయం
పరిష్కార వేదికకు 129 వినతులు


