● పోస్టల్ ఉద్యోగి బలవన్మరణం
● భార్య 9 నెలల నిండు గర్భిణి
● అనంతపురం రూరల్ మండలం మధురానగర్‌లో విషాదం
రాప్తాడు రూరల్: కారణాలు తెలీదుకాని జీవితంపై విరక్తితో ఓ పోస్టల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య 9 నెలల నిండు గర్భిణి. 18 నెలల వయసున్న కుమార్తె అంటే అమితమైన ప్రేమ. తాను చనిపోయే ముందు కుమార్తె గుర్తుకొచ్చింది కాబోలు చివరిసారిగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఏమనిపించిందో ఏమో కానీ, మళ్లీ వీడియోకాల్ చేసి మాట్లాడాడు. బాధనంతా దిగమింగుకుని యోగక్షేమాలు అడిగి ఫోన్ పెట్టేశాడు. ఆ కుటుంబానికి అదే చివరికాల్ అయింది. ఫోన్ పెట్టేసిన కాసేపటికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సోమవారం అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డు మధురానగర్ మూడోక్రాస్‌లో సోమవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఈదులముష్టూరుకు చెందిన కుమ్మర గోపినాథ్ (38)కి అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన కుమ్మర శ్రావణితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 18 నెలల కుమార్తె ఉంది. శ్రావణి ప్రస్తుతం 9 నెలల నిండు గర్బిణి. ఇంకో నాలుగైదు రోజుల్లో కాన్పు కానుంది. అనంతపురం రూరల్ మండలం మధురానగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆత్మకూరు పోస్టాఫీసులో పని చేస్తున్నాడు. భార్య డెలివరీ కోసమని పుట్టింటికి వెళ్లింది. గోపినాథ్ ఒక్కడే ఇంట్లో ఉంటూ డ్యూటీకి వెళ్లి వచ్చేవాడు. కొన్నేళ్ల పాటు ఊరి నుంచి డ్యూటీకి వెళ్లి వస్తే తనకెంతో సౌకర్యవంతంగా ఉంటుందని భార్య అభ్యర్థనకు గోపినాథ్ అంగీకరించాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం మధురానగర్‌లో ఉన్న ఇంట్లో నుంచి చాలా సామగ్రిని ఆలమూరుకు తరలించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండగా...రెండు మూడు రోజుల్లో ఖాళీ చేయాలని భావించారు. ఇంతలో ఏమి జరిగిందో ఏమో తెలీదు కాని గోపినాథ్ సోమవారం మధ్యాహ్నం భార్య, కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడాడు. మరో మారు భార్య ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయలేదు. మామ సుబ్బరాయుడు ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే ఇంటి యజమానికి శ్రావణి ఫోన్ చేయడంతో ఆమె మిద్దైపెకి వెళ్లి చూడగా అప్పటికే వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న గోపినాథ్ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని వెంటనే కిందకు దింపి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
కారు బోల్తా.. వ్యక్తి మృతి
బెళుగుప్ప: మండలంలోని నరసాపురం వద్ద ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... రాయదుర్గం నివాసి లడ్డూ వలీసాహెబ్ (66) కుటుంబసభ్యులతో కలసి కారులో సోమవారం ఉదయం కళ్యాణదుర్గం బయలుదేరాడు. నరసాపురం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్లంలోకి బోల్తా కొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే వలీ సాహెబ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డ్రైవర్ రామచంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో ఇద్దరు కుటుంబసభ్యులు బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వలీసాహెబ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


