వైభవంగా శ్రీవారి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి రథోత్సవం

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

బొమ్మనహాళ్‌: మండల కేంద్రంలో వెలసిన వేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉదయం 6 గంటలకు దీక్షా హోమం, బలిహరణ, 10 గంటలకు రథాంగహోమం, రథ బలి, మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి బ్రహ్మ రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవం ముందు వివిధ వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, భక్తులు కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

గనిలో ప్రమాదం – కార్మికుడి మృతి

యాడికి: గనిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ కడప జిల్లా వీరనాయునిపల్లికి చెందిన రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి (25) ఇద్దరూ యాడికి మండలంలోని బోయరెడ్డి పల్లి సమీపంలో ఉన్న అదానీ సిమెంట్స్‌ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కుందన కోట – గుడిపాడు గ్రామాల మధ్యలో ఉన్న గనుల్లో విధుల్లో ఉన్న సూపర్‌వైజర్‌ పవన్‌కుమార్‌రెడ్డిని గని నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ఢీకొంది. తలకు బలమైన గాయమైన పవన్‌కుమార్‌రెడ్డిని వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న యాడికి సీఐ శ్రీనివాసులు, సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement