అనంతపురం అర్బన్: పెద్దవడుగూరు మండలం కొండుపల్లి వద్ద వందల ఎకరాల్లో సాగుతున్న అక్రమ మైనింగ్‌ను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాంటూ జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్‌కు సీపీఐ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన పరిష్కార వేదికలో జేసీని సీపీఐ నాయకులు వెంకటరాముడు, సూర్యనారాయణరెడ్డి, చిరుతల మల్లికార్జున కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. కొండుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 698–ఏ, సీ, బీ2, 697, 699, 688–ఏ2, బీ–1లో అక్రమ మైనింగ్ సాగుతోందన్నారు. దాదాపు రూ.6 కోట్లు విలువ చేసే డోలమైట్, స్టీటైట్ ఖనిజం 8వేల టన్నులకు పైగా తరలించారని ఆరోపించారు. ఈ విషయం రెవెన్యూ, గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళితే మొక్కబడిగా తనిఖీలు నిర్వహించి కొంత ఖనిజం సీజ్ చేశారని, అయితే ఎవరిపై చర్యలు తీసుకున్నది లేదన్నారు. తహసీల్దారు సీజ్ చేసిన ఖనిజాన్ని కొద్ది రోజుల తరువాత అక్రమార్కులు తరలించి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. కొండుపల్లిలో 10 గనులు మాత్రమే అనుమతి పొంది నడుస్తున్నాయని, మిగిలినవన్నీ అక్రమంగా నడుస్తున్నవే తెలిపారు. దీనిపై తనిఖీలు నిర్వహించి అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుత్తి
గుత్తి: గుత్తి మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ అయ్యింది. జనాభా, ఆదాయం ఆధారంగా థర్డ్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్‌గ్రేడ్ కావడం వల్ల ఎక్కువ నిధులతో పాటు అదనపు సిబ్బంది వస్తారు. మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది.


